Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల జరిగిన ఒక బాధాకరమైన ఘటనపై తన భావాలను మీడియా ఎదుట పంచుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన ఆరోపణలపై స్పందించిన అల్లు అర్జున్, ఈ ఘటన తనకు తీవ్ర మనోవేదన కలిగించిందని చెప్పారు.
అయితే, ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని, ఆమె కుటుంబానికి, ముఖ్యంగా ఆమె భర్తకు తన ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ, “ఈ ఘటన ఎవరి తప్పు కాదు. ఇది దురదృష్టకరమైన యాక్సిడెంట్. మేము మంచి సినిమా అందించడానికి శ్రమించాం, థియేటర్ యాజమాన్యం కూడా తమవంతుగా ప్రయత్నించారు. పోలీసులు కూడా రక్షణ కల్పించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. అయినప్పటికీ, ఈ సంఘటన జరిగింది. ఇది ఎవరి నియంత్రణలోనూ లేదు. ఆ కుటుంబం కోలుకోవడానికి మేము చేయగలిగిన సహాయం చేస్తాము” అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Daggubati Purandeswari: అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన పురంధేశ్వరి
Allu Arjun: అతను తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, “నేను నమ్మిన విలువలకు వ్యతిరేకంగా ప్రవర్తించలేను. నా ఉద్దేశ్యం ఎల్లప్పుడూ ప్రేక్షకులను సంతోషంగా పంపించడం మాత్రమే. థియేటర్లను ఆలయాలుగా భావించే వ్యక్తిని. ఆ రోజు జరిగిన ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. థియేటర్ వద్ద నేను పర్మిషన్ లేకుండా వెళ్లలేదని స్పష్టం చేస్తున్నాను. పోలీసులు, మేనేజ్‌మెంట్ సూచనల ప్రకారమే ముందుకు వెళ్లాను” అని స్పష్టీకరించారు.
అతను తన బాధను వ్యక్తపరుస్తూ, “20 ఏళ్లుగా నన్ను చూసిన అభిమానులు నాకు నమ్మకం ఉంచాలి. ఒక తండ్రిగా, బాధ్యతాయుతమైన వ్యక్తిగా బాధితులకు సాయపడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఈ సమయంలో బాధిత కుటుంబాన్ని నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి బిడ్డకు మెరుగైన భవిష్యత్తు కోసం సహాయం అందిస్తాను” అని తెలిపారు.
తన సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేయలేకపోయానని, జరిగిన ఘటనతో బాధపడుతూ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు ముందు వరుసలో ఉన్నానని చెప్పారు. “ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాము” అని అల్లు అర్జున్ తన ప్రసంగాన్ని ముగించారు.