Hyderabad Metro: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా విభాగంలో ఒక కీలక బదిలీ ఇంకా నియామకాన్ని చేపట్టింది. ప్రస్తుతం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా విధుల్లో ఉన్న సీనియర్ ఐడీఈఎస్ (IDES-2012) అధికారి బి. అజిత్ రెడ్డికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగిన అదనపు బాధ్యతలను అప్పగించింది. ఆయనను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అదనపు మేనేజింగ్ డైరెక్టర్ (Additional MD) గా నియమిస్తూ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
పరిశ్రమలు, వాణిజ్య (I&C) మరియు ఐటీ శాఖ పరిధిలోని ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా కొనసాగుతున్న అజిత్ రెడ్డి.. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలను (Full Additional Charge – FAC) నిర్వర్తిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో మెట్రో రైలు రెండో దశ (ఫేజ్-2) విస్తరణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో, సమర్థుడైన అధికారికి ఈ అదనపు బాధ్యతలు అప్పగించడం రవాణా రంగ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా పెట్టుబడులను ఆకర్షించడంలో చురుకైన పాత్ర పోషిస్తున్న అజిత్ రెడ్డి, ఇప్పుడు మెట్రో విస్తరణ ప్రాజెక్టుల పర్యవేక్షణలోనూ కీలక భూమిక పోషించనున్నారు…
