Sarada Peetham: తెలుగులో ఒక ముతక సామెత ఉంది.. అది ఇక్కడ చెప్పుకోవడం బాగోదు కానీ.. దాని స్థూల అర్ధం “ఎవడు చేసే పని వాడు చేయాలి” అని. నిజమే కదా.. రాజకీయనాయకులు రాజకీయం చేయాలి.. వ్యాపారాలు చేసుకునే వారు వ్యాపారం చేయాలి.. అలాగే సన్యాసం తీసుకున్నవారు ధర్మం ప్రకారం సన్యాస జీవితాన్ని భవబంధాలకు అతీతంగా.. లౌకిక విషయాలకు దూరంగా గడపాలి. ప్రజలకు.. ఆధ్యాత్మిక ప్రశాంతత కోరుకునే వారికి నాలుగు మంచి మాటలు చెప్పాలి. వారి మనసులను ధర్మ బద్ధ ఉపన్యాసాలతో ఆహ్లాద పరచాలి. సమాజంలో నేరప్రవృతులు పెరగకుండా అందరి మనసులు స్వచ్ఛంగా ఉండేలా వారికీ ధర్మ నిర్దేశం చేయాలి. ఇవేవీ చేయలేకపోతే అన్నీ మూసుకుని తపస్సు చేసుకుంటూ కాలక్షేపం చేయాలి.
కానీ, ఇప్పుడు ఏమి జరుగుతోంది? సన్యాసం తీసుకుని.. రాజకీయనాయకులతో అంటకాగి.. వేలాది కోట్ల రూపాయల భూములను ఆశ్రమాల పేరుతో ఆక్రమించుకుని.. హైటెక్ స్వాములుగా ప్రచారం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. వాళ్ళ ప్రవచనాల్లోనే చెప్పినట్టు దేవుడు చూస్తూ ఊరుకోడు కదా.. పాపం పండేదాకా ఓపిక పడతాడు.. తరువాత ఎక్కడ నొక్కాలో అక్కడ ఒక నొక్కు నొక్కుతాడు. దెబ్బతో సన్యాస తత్త్వం అర్ధం అయి.. అన్నీ మూసుకుని తపస్సు చేయడానికి ఎక్కడికి పోవాలా అని ఆలోచనలో పడతారు హైటెక్ స్వాములు.
Sarada Peetham: ఇదిగో అలా దేవుడు కాదు.. కాదు.. మన రాజకీయనాయకులు చెబుతారుగా ఓటర్లే దేవుళ్ళని.. వాళ్ళు కొట్టిన దెబ్బకు ఒక రాజకీయ గురువు.. నిజంగానే సన్యాసం తీసుకుని అన్నీ మూసుకోకపోయినా.. ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు పోయేదారి వెతుక్కుంటున్నారు. ఆయనే.. విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామి. అయ్యో అంత పెద్ద అయ్యోరికి ఇప్పుడు తప్పస్సుకు పోయే పని ఏమి వచ్చింది అని అనుకుంటున్నారా? భక్తులకు విలువలు చెప్పి.. తాను వాటి వలువలు విప్పేస్తానంటే అలాగే జరుగుతుంది మరి. అప్పట్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ముద్దులు పెట్టి మరీ ఆశీర్వచనాలు పలికి వైసీపీ నాయకుడికి కాదు.. ఆ పార్టీ మొత్తానికే ఆధ్యాత్మిక గురువుగా ప్రచారంలోకి వచ్చారు ఆయన. తరువాత కథ తెలిసిందే కదా. అయ్యోరు తన ఆశ్రమం కోసమని విశాఖలో కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని అప్పనంగా కట్టపెట్టేసింది అప్పటి ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం మారింది. స్వామిలోరి సంగతి తేలింది. దీంతో ఆ భూమిని వెనక్కి తీసుకుంది ప్రభుత్వం.
ఇది కూడా చదవండి: Farming: సహజ వ్యవసాయం కోసం కేంద్రం కొత్త పథకం
Sarada Peetham: పార్టీని నమ్ముకుని రాజకీయాలు చేసే నాయకులకు పార్టీ ప్రభావంతోనే మనుగడ ఉంటుంది. అదే పరిస్థితి స్వరూపానందేంద్ర స్వామికి వచ్చింది ఇప్పుడు. అప్పట్లో ప్రభుత్వం అండతో రాష్ట్రంలోని ఆలయాలన్నిటిలో తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపించుకున్న కీర్తి కండూతికి ప్రజల్లో అసహనం వ్యక్తం అయిన వార్తలు చాలానే వచ్చాయి. ఇప్పుడు అలాంటి ప్రాభవం ఏమీ లేదు. కనీసం ఆయనను అయ్యో అనే భక్తులు కూడా కనిపించడం లేదు. దీంతో ఈ స్వామివారికి తత్త్వం బోధపడింది. విశాఖలో ఉండి అనామకంగా బతకడం కంటే.. కనీసం ప్రశాంతంగా ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటే మంచిది అనిపించిందట. అందుకే ఈసారి నిజమైన సన్యాసిలా మారిపోయి.. రిషికేష్ వెళ్లి తపస్సు చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని అంటున్నారు. అన్నట్టు ఆయనకు ప్రభుత్వం గతంలో ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేసింది. సన్యాసులకు రక్షణ ఎందుకు అనే కఠోర వాస్తవం కూడా అయ్యవారికి బోధపడిందట. అందుకే తనకిచ్చిన సెక్యూరిటీని వెనక్కి తీసుకొమ్మని డీజీపీకి లెటర్ రాశారట స్వరూపానందేంద్రుల వారు.
అదండీ విషయం ముందే చెప్పినట్లు ఎవరు చేసే పని వారు చేయాలి. రాజకీయ నాయకుల అండతో సూపర్ స్వామి అయిపోవాలని కలలు కన్న సన్యాసి స్వామివారి కథ ఇది. ఆఖరుకు విశాఖ నుంచి రిషికేష్ చేరుతోంది. అన్నట్టు.. రిషికేష్ ఆయనొక్కరే వెళ్తారా ప్రియాతిప్రియమైన శిష్యుడు జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకువెళతారా? ఆ ఒక్కటీ అడక్కండి!