Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రస్తుతం రాజకీయం వాడిగా, వేడిగా సాగుతోంది. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతుంది. ఎమ్మెల్యే కబ్జా కోరంటూ కంది వ్యాఖనిస్తుండగా, అసలు కబ్జాలు చేసేదే ఆయన అంటూ ఎమ్మెల్యే దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలా ఇద్దరూ ఒకరిపై ఒకరు మాటల బాణాలు
విసురుకుంటూ ఆదిలాబాద్ రాజకీయాన్ని వేడేకిస్తున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే, మరుపటి రోజు ఎమ్మెల్యే తిరిగి విలేకరుల సమావేశం నిర్వహించి భూ కబ్జా ఆరోపణలు ఖండిచమే కాకుండా, అసలు కబ్జాదారు కంది శ్రీనివాసేనని, డొల్ల కంపెనీలు పెట్టి తాను మోసాలకు పాల్పడలేదని పరోక్షంగా ఆయనపై ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ కంది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. దాదాపు 400 కోట్ల విలువైన భూమిని మింగేసిన శంకర్, కబ్జాల్లో నెంబర్ వన్ అంటూ దుయ్యబట్టారు. తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున భూదందా చేసిన వారిలో మన ఎమ్మెల్యే ఫస్ట్ అన్నారు. ప్రభుత్వ భూమినే అల్లుడి పేర కబ్జా చేసి పార్టీ ఆఫీస్ కోసం అదే పార్టీకి అమ్మిన చరిత్ర పాయల్ శంకర్‌దని ఎద్దేవా చేసారు. ఎన్నికల సమయంలోను తప్పుడు అఫిడవిట్ సమర్పించారని దుయ్యబట్టారు. కొంత మంది భాగస్వాములు అనుచరులతో కలిసి ఆదిలాబాద్‌లో భూ మాఫియా నడిపిస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్ సెటిల్ మెంట్లు చేయడం ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య అన్నారు. ఎమ్మెల్యే భూ బాగోతాన్ని, సంబంధించిన రుజువులను సీఎం రేవంత్ రెడ్డికి, బీజేపీ అధిష్టానికి కూడా పంపిస్తామన్నారు. ఆయన దోచుకున్న భూములను వెనక్కి తీసుకుంటే 35 వేల మంది పేదలకి ఇంటి సమస్య తీర్చవచ్చని దుయ్యబట్టారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం దీనికి ధీటుగా స్పందించారు. అవి కేవలం ఆరోపణలు తప్ప ఎలాంటి ఆధారాలు లేవంటూ కొట్టిపారేశారు. అప్పటి కలెక్టర్ అహ్మద్ బాబు హయాంలో ఎన్వోసీ ఇచ్చిన భూమినే తన అల్లుడు కొనుగోలు చేశాడని ఇందులో కబ్జా ఎక్కడ ఉందన్నారు. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేసే నైజం తనది కాదని, న్యాయంగా ఆస్తులు సంపాదించడం తప్పేనా? అని ప్రశ్నిం చారు. చివరకు డైట్ మైదానంలో మహాయజ్ఞం నిర్వహణ విషయంలోనూ విమర్శలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని పాయల్ శంకర్ దుయ్యబట్టారు. కంది శ్రీనివాస్ రెడ్డి తన ప్రజా భవన్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న నీటి పారుదలశాఖ స్థలం కబ్జా చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులను కలుస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నానని, ఓర్వలేక తనపై తప్పుడు ఆరోపణలు
చేస్తున్నారని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. అధికారంలో ఉంది మీ ప్రభుత్వమేగా విచారణ జరిపించు అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కంది శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు.
ఇలా ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా రాజకీయం కాస్తా హాట్ టాపిక్‌గా మారింది. మరి నిజంగానే ఒకరిపై ఒకరు చేసిన ఆరోపణలు నిరూపిస్తారా..? లేక కొద్ది రోజుల తర్వాత మర్చిపోతారా..? ప్రజలకు వారిద్దరు ఫైనల్‌గా ఏం చేప్తారనేది వేచి చూడాలి.
రాసిన వారు: లక్కాకుల శ్రీనివాస్
మహాన్యూస్ స్టాప్ రిపోర్టర్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా..