Sampath Nandi: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా నుంచి తాను తప్పుకోవడం వెనుక ఉన్న అసలు కారణాన్ని ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఎట్టకేలకు స్పష్టం చేశారు. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అధికారికంగా మొదలైన తర్వాత, సంపత్ నంది స్థానంలో దర్శకుడు బాబీ రావడంతో పవన్-సంపత్ మధ్య విభేదాలు తలెత్తాయని రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే తాజాగా శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కి, రేపు (నవంబర్ 27, 2026) థియేటర్లలోకి రానున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ (Bhogi) ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ రూమర్లన్నింటికీ చెక్ పెట్టారు.
పవన్ కల్యాణ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, కేవలం షూటింగ్ ప్రారంభం ఆలస్యం కావడం వల్లే పరస్పర అంగీకారంతో ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగానని సంపత్ నంది వెల్లడించారు. ఆనాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ.. “‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు నేనే మొదటి డైరెక్టర్‌ను. కానీ అప్పట్లో పవన్ కల్యాణ్ గారి వరుస సినిమాలు, ఇతర అనివార్య కారణాల వల్ల షూటింగ్ మొదలవ్వడం ఆలస్యమైంది.
సినిమా మరింత లేట్ అవుతుందని తెలిసి ఒకరోజు పవన్ కల్యాణ్ గారే స్వయంగా నన్ను పిలిచి మాట్లాడారు. సినిమా మొదలవ్వడానికి కొంత సమయం పట్టేలా ఉంది, అప్పటివరకు వెయిట్ చేయగలరా అని అడిగారు” అని సంపత్ నంది తెలిపారు. దానికి తాను స్పందిస్తూ “నేను ఈ గ్యాప్‌లో వేరే సినిమా పూర్తి చేసుకుంటే మీకు ఇబ్బందేమీ లేదు కదా సర్ అని అడిగాను. ఆయన కూడా ఏం లేదు చేసుకోండి అన్నారు” అని వివరించారు.
అలాగే అప్పట్లో ప్రచారం జరిగినట్లుగా తాను పవన్ కల్యాణ్‌తో చేయాల్సింది రీమేక్ కథ కాదని, ఒరిజినల్ కథతోనే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్లాన్ చేశామని సంపత్ నంది స్పష్టం చేశారు. ఒక దర్శకుడి కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని తన కోసం ఎక్కువ కాలం ఎదురుచూసేలా చేయడం పవన్ కల్యాణ్‌కు అస్సలు ఇష్టం ఉండదని, తాను తప్పుకున్న తర్వాత కూడా తనతో సినిమా చేయడానికి పవన్ చివరి వరకు ప్రయత్నించారని నిర్మాతల ద్వారా తెలిసిందని ఆయన పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్‌తో కలిసి ఆ సినిమా కోసం పనిచేసిన కొద్ది కాలం తన జీవితంలో ఒక మధుర జ్ఞాపకమని సంపత్ నంది కొనియాడారు. కాగా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా 1960ల నేపథ్యంలో తెరకెక్కిన సంపత్ నంది తాజా సినిమా ‘భోగి’ నవంబర్ 27న పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
