Akhil Akkineni: సోషల్ మీడియాలో ‘అయ్యగారే నెంబర్ వన్’ అనే డైలాగ్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అక్కినేని వీరాభిమాని నాగరాజు కల నెరవేరింది. తను ప్రాణంగా అభిమానించే యంగ్ హీరో అఖిల్ అక్కినేనిని ఆయన ఎట్టకేలకు ముఖాముఖి కలిశారు. జులై 15న గుంటూరులో అఖిల్ లేటెస్ట్ సినిమా ‘లెనిన్’ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ జరిగింది. ఈ వేడుక ముగిసిన తర్వాత అఖిల్ తన అభిమాని నాగరాజును ప్రత్యేకంగా తన కారవాన్‌లోకి పిలిపించుకొని మాట్లాడారు.
నీ వల్లే నాకు ‘అయ్యగారు’ అనే పేరొచ్చింది
నాగరాజు కారవాన్‌లోకి రాగానే ఎంతో ఉద్వేగానికి గురై అఖిల్ కాళ్ల మీద పడబోయారు. కానీ అఖిల్ వెంటనే అతడిని ఆపి, ఎంతో ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు (హగ్ చేసుకున్నారు).
ఇప్పుడు హ్యాపీగా ఉన్నావ్ కదా.. నీ వల్లే నాకు సోషల్ మీడియాలో ‘అయ్యగారు’ అనే ట్యాగ్, అంతటి క్రేజ్ వచ్చాయి అని అఖిల్ అనడంతో నాగరాజు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
మనం మళ్లీ ఇంకో పెద్ద హిట్ కొడదాం” అని అఖిల్ అనగా, “ఈసారి హిట్ కొడితే బాక్సాఫీస్ దగ్గర మన రేంజ్ ఎక్కడో ఉండాలి అయ్యగారు” అంటూ నాగరాజు భావోద్వేగంతో సమాధానమిచ్చారు. ఇదే సమయంలో అఖిల్ తన భార్య జైనబ్‌ను కూడా నాగరాజుకు పరిచయం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఎవరీ నాగరాజు? ‘అయ్యగారు’ ట్రెండ్ ఎలా మొదలైంది?
నాగరాజు సాధారణంగా పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తుంటారు. ఆయన అక్కినేని ఫ్యామిలీకి, ముఖ్యంగా నాగార్జున, అఖిల్‌లకు కల్ట్ ఫ్యాన్. అక్కినేని హీరోల సినిమా రిలీజ్ అయిందంటే చాలు థియేటర్ల దగ్గర హంగామా చేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటారు.
గతంలో అఖిల్ సినిమా విడుదలైన సమయంలో థియేటర్ వద్ద మైక్ ముందుకు వచ్చి.. “దేనికైనా అయ్యగారే కరెక్ట్.. అఖిలే నెంబర్ వన్! ఏదైనా అఖిల్ వల్లే అవుతుంది, ఇంకెవరి వల్లా కాదు” అంటూ నాగరాజు డైలాగ్స్ చెప్పారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయిందంటే, అప్పటి నుండి నెటిజన్లు అఖిల్‌ను ‘అయ్యగారు’ అని పిలవడం మొదలుపెట్టారు.
దీనిపై నెగెటివ్‌గా ఫీల్ అవ్వకుండా అఖిల్ ఎంతో పాజిటివ్‌గా తీసుకున్నారు. ఇప్పుడు అది ఏకంగా అఖిల్ అక్కినేని బ్రాండ్ నేమ్‌గా మారిపోయింది. ప్రస్తుతం అఖిల్ నటించిన ‘లెనిన్’ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ కావడంతో అటు హీరో, ఇటు ఆయన నెంబర్ వన్ ఫ్యాన్ ఇద్దరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
View this post on Instagram
