Vijayawada: విజయవాడ నగరంలోని కొత్తపేటలో గురువారం రాత్రి అత్యంత దారుణమైన ఘటన జరిగింది. కేవలం 10 రూపాయల కోసం జరిగిన గొడవ ఒక వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న చిన్న కారణంతో ఓ మైనర్ బాలుడు, వయసులో పెద్దవాడైన వ్యక్తిని కత్తితో పొడిచి చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే? కొత్తపేట ప్రాంతానికి చెందిన తాతాజీ (48) అనే వ్యక్తి గురువారం రాత్రి ఒక బార్ వద్ద ఉన్న సమయంలో, 17 ఏళ్ల ఓ బాలుడు అక్కడికి వచ్చాడు. తనకు మద్యం తాగేందుకు 10 రూపాయలు ఇవ్వాలని తాతాజీని అడిగాడు. దానికి ఆయన నిరాకరించడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ బాలుడు, తన వద్ద ఉన్న కత్తితో తాతాజీపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఘటనా స్థలంలోనే మృతి బాలుడు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన తాతాజీ, రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గాయాలు బలంగా తగలడంతో ఆయన ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే కొత్తపేట పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడైన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కేవలం పది రూపాయల కోసం ఇంత దారుణానికి ఒడిగట్టడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
