Gaza: ఇజ్రాయెల్ దాడులతో నెలల తరబడి భయంతో గడిపిన గాజా ప్రజలు ఇప్పుడు కొంతవరకు ఊపిరి పీలుస్తున్నారు. ప్రాంతంలో శాంతి వాతావరణం నెలకొనడంతో అక్కడ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్న ఖాన్ యూనిస్‌లో మంగళవారం భారీ స్థాయిలో సామూహిక వివాహాలు జరిగాయి. ఒకే వేదికపై 54 జంటలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడంతో అక్కడ వాతావరణం పండగలా మారింది.
యుద్ధం కారణంగా పలుమాసాలుగా నిలిచిపోయిన పెళ్లిళ్లు ప్రస్తుతం మళ్లీ ప్రారంభమవుతున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న సమయంలో, ప్రజలు జీవితాన్ని తిరిగి గాడిన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సామూహిక పెళ్లిళ్లకు యూఏఈ మద్దతుతో పనిచేస్తున్న మానవతా సంస్థ ‘అల్ ఫారెస్ అల్ షాహిమ్’ ఆర్థిక సహాయం అందించింది. కొత్త జంటలకు కొంత నగదు, అవసరమైన సామగ్రి కూడా ఇచ్చింది.
Also Read: Falcon Case: ₹792 కోట్ల మోసం కేసు.. నిందితుడి లగ్జరీ జెట్‌ను వేలం వేస్తున్న ఈడీ!
ఈ వేడుకలో పాలస్తీనాలకు చెందిన ఎమన్ హసన్ లావా, హిక్మత్ లావా జంట కూడా వివాహం చేసుకున్నారు. యుద్ధంలో తమ ఇల్లు, కుటుంబ సభ్యులను కోల్పోయిన వీరు నెలల తరబడి వేరే పట్టణాల్లో ఆశ్రయం, ఆహారం కోసం ఇబ్బందులు పడ్డారు. యుద్ధం తమ జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని హిక్మత్ బాధ వ్యక్తం చేశాడు. “సాధారణ మనిషిలా కుటుంబంతో కలిసి ఉండాలని కలలు కనాను. కానీ యుద్ధం మా జీవితంలో ఉన్నదంతా తుడిచిపెట్టేసింది. ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టాలనుకుంటున్నాం… కానీ అది పాత పరిస్థితిలా ఉండదు” అని అతను అన్నారు.
గాజాలో జరిగిన బాంబు దాడుల్లో భవనాలు నేలమట్టం కావడంతో రెండు మిలియన్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. నెలల తరబడి పేలుళ్లతో వణికిపోయిన ఈ ప్రాంతం, ఇటీవల శాంతి ఒప్పందం తర్వాత కొంత ప్రశాంతతను పొందుతోంది. ఈ అవకాశం వచ్చిన వెంటనే ఎప్పటినుంచో పెళ్లి కోసం ఎదురుచూస్తున్న జంటలు ఒకేసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి.
ఖాన్ యూనిస్‌లోని హమద్ నగరంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో సాంప్రదాయ పాలస్తీనియా దుస్తుల్లో ఎమన్ హసన్ లావా, సూట్ ధరించిన హిక్మత్ లావా శిథిలమైన భవనాల మధ్య చేయి చేయి పట్టుకుని నడిచిన దృశ్యం అక్కడి ప్రజలకు కొత్త ఆశను ఇచ్చింది. అదే విధంగా వందలాది మంది బందువులు, స్థానికులు ఈ వేడుకలో పాల్గొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న జంటలను ఆశీర్వదించారు. రెండు సంవత్సరాల పాటు నిరంతరంగా ఎదుర్కొన్న యుద్ధం, మరణం తర్వాత ఈ సామూహిక వివాహాలు గాజా ప్రజలకు తిరిగి పుట్టిన ఆశ వంటివిగా మారాయి.


