Ponnam Prabhakar: పవన్ మాట్లాడింది సరైనది కాదు

Ponnam Prabhakar: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ‘దిష్టి’ వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ రెండు రాష్ట్రాల మధ్య సౌహార్ద వాతావరణాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని ఆయన హెచ్చరించారు. మంగళవారం హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ స్పందించారు.

కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజల దిష్టి కారణమని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీ సముద్రం నుంచి వచ్చే తుపాను మా రాష్ట్రాన్ని ముంచేస్తున్నా మేమెవరినీ తప్పుబట్టలేదు. అవి ప్రకృతి విపత్తులని భావించాం. కానీ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలరు? కోనసీమపై మేమెందుకు దిష్టి పెడతాం?” అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాష్ట్రాలు అన్నదమ్ముల్లాంటివని, ఇలాంటి వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య అగాధాన్ని సృష్టిస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తులో ఉన్న ప్రభుత్వ ప్రతినిధి ఇలా మాట్లాడటం బాధాకరమని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ నాయకత్వం వెంటనే స్పందించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *