Hyderabad Expansion

Hyderabad Expansion: జీహెచ్‌ఎంసీ చరిత్రలో మరో మైలురాయి.. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనానికి గవర్నర్ ఆమోదం!

Hyderabad Expansion: గ్రేటర్ హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయానికి మార్గం సుగమమైంది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్‌) పరిధిలోని మొత్తం 27 స్థానిక సంస్థలను (20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేసేందుకు సంబంధించిన ఆర్డినెన్స్ డ్రాఫ్ట్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు.

విలీనం దిశగా కీలక అడుగు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించాలని రాష్ట్ర మంత్రివర్గం (కేబినెట్) ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం మేరకు, జీహెచ్‌ఎంసీ, తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్‌లలో సవరణలు చేస్తూ రూపొందించిన ఆర్డినెన్స్ డ్రాఫ్ట్‌ను కేబినెట్ గవర్నర్‌కు పంపింది. సోమవారం (డిసెంబర్ 01) ఈ సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలపడంతో, ఈ విలీన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా గెజిట్‌ను జారీ చేయనుంది.

ఇది కూడా చదవండి: Jaya Bachchan: “వివాహంపై నా సలహా అక్కర్లేదు”: నేటి తరం ఆలోచనలపై జయా బచ్చన్ వ్యాఖ్యలు

27 ప్రాంతాలు ఇక గ్రేటర్‌లో భాగం

ఈ విలీనం ద్వారా ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల, అలాగే దానికి ఆనుకుని ఉన్న పలు ముఖ్య ప్రాంతాలు ఇకపై జీహెచ్‌ఎంసీలో భాగం కానున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం గణనీయంగా పెరగనుంది. ఈ పరిధి విస్తరణతో మెరుగైన పౌర సేవలు, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

విలీనం కాబోయే కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల జాబితా:

  • పెద్ద అంబర్ పేట

  • జల్ పల్లి

  • శంషాబాద్

  • తుర్కయాంజిల్

  • మణికొండ

  • నార్సింగ్

  • ఆదిభట్ల

  • తుక్కుగూడ

  • మేడ్చల్

  • దమ్మాయిగూడ

  • నాగారం

  • పోచారం

  • ఘట్కకేసర్

  • గుండ్ల పోచంపల్లి

  • తూముకుంట

  • కొంపల్లి

  • దుండిగల్

  • బొల్లారం

  • తెల్లాపూర్

  • అమీన్ పూర్

  • బడంగపేట్

  • బండ్లగూడ జాగీర్

  • మీర్ పేట

  • బోడుప్పల్

  • పీర్జాదీగూడ

  • జవహర్ నగర్

  • నిజాంపేట

ఈ విలీనం ద్వారా నూతనంగా గ్రేటర్‌లో చేరబోతున్న ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. కొత్తగా ఏర్పడే జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *