Jaya Bachchan

Jaya Bachchan: “వివాహంపై నా సలహా అక్కర్లేదు”: నేటి తరం ఆలోచనలపై జయా బచ్చన్ వ్యాఖ్యలు

Jaya Bachchan: ప్రముఖ నటి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ వివాహం, నేటి యువత ఆలోచనా విధానంపై చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి. ‘వి ది విమెన్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ప్రస్తుత జనరేషన్‌ పిల్లలకు తాను పెళ్లి గురించి ఎలాంటి సలహాలు ఇవ్వబోనని స్పష్టం చేశారు. ముందుగా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలని, సంతోషంగా ఉండాలనే స్వేచ్ఛ వారికి ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.

పెళ్లి అనేది ‘పాతబడిన వ్యవస్థ’గా (Outdated Institution) మారిందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆధునిక సంబంధాలకు చట్టపరమైన ముద్ర అవసరం లేదని, ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి, కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటే సరిపోతుందని జయా బచ్చన్ నొక్కి చెప్పారు. “వివాహం ఇలాగే ఉండాలి, అలా ఉండాలి అని చట్టబద్ధమైన నిర్వచనాలు లేవు, అలా నిర్వచించాల్సిన అవసరం కూడా లేదు” అని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సరదాగా “పెళ్లి అనేది ఢిల్లీ లడ్డూ లాంటిది.. తిన్నా కష్టమే, తినకపోయినా కష్టమే” అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.

Also Read: Spirit: స్పిరిట్‌లో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్?

తన మనవరాలు, అమితాబ్ బచ్చన్ కూతురు నవ్య నవేలి నందా భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, “నవ్య ఇప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆమెకు మరికొన్ని రోజుల్లో 28 సంవత్సరాలు నిండుతాయి. ముందుగా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి” అని జయా బచ్చన్ అన్నారు. నేటి తరం పిల్లలు చాలా తెలివైనవారని, అన్ని విషయాల్లో, నిర్ణయాల్లో తమను మించిపోయారని, అందుకే వారికి సలహా ఇవ్వడానికి తాను చాలా పాతదాన్ని అయ్యానని ఆమె ఒప్పుకున్నారు. సాంప్రదాయ పద్ధతులు, సామాజిక కట్టుబాట్లు నేటి యువతకు సరిపోవని, ప్రతి ఒక్కరూ తమ జీవితాలను తమకు నచ్చిన విధంగా నిర్వచించుకునే స్వేచ్ఛ ఉండాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక నవ్య నవేలి నందా విషయానికి వస్తే, ఆమె సోషల్‌మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నారు. సినిమాల్లోకి వస్తారనే వార్తలను ఆమె కొట్టిపారేశారు. తనకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదని స్పష్టం చేసిన నవ్య, తన స్నేహితులతో కలిసి మహిళల కోసం ‘ఆరా హెల్త్’ (Aara Health) అనే ఆన్‌లైన్‌ హెల్త్‌కేర్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ వేదికగా మహిళల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *