Visakhapatnam

Visakhapatnam: విశాఖ పర్యాటక రంగంలో మరో మెట్టు: కైలాసగిరి గ్లాస్‌ బ్రిడ్జి ప్రారంభం

Visakhapatnam: విశాఖపట్నంలోని కైలాసగిరి పర్వతంపై పర్యాటకులకు మరో కొత్త ఆకర్షణగా గ్లాస్‌ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ బ్రిడ్జిని సుమారు రూ.7 కోట్ల వ్యయంతో పూర్తి చేసి, ఎంపీ శ్రీభరత్‌, మేయర్‌ పీలా శ్రీనివాసరావు సోమవారం ఉదయం అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ ఛైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయడంపైనే దృష్టి పెట్టామని ప్రణవ్‌ గోపాల్‌ ఈ సందర్భంగా తెలిపారు. విశాఖను దేశంలో ప్రముఖ పర్యాటక రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పలు ప్రాజెక్టులు చేపడుతున్నామని చెప్పారు. కైలాసగిరిపై నిర్మించిన ఈ గ్లాస్‌ బ్రిడ్జి కూడా ఆ దిశలో కీలక అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Also Read: Narendra Modi: చట్ట సభల్లో డ్రామాలు వద్దు… మంచి చర్చలు జరగాలి

భూకంపాలు, తుఫానులు, భారీ గాలులు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ఈ బ్రిడ్జి ఏ మాత్రం దెబ్బతినకుండా నిలబడేలా ప్రత్యేక డిజైన్‌తో నిర్మించారని ఆయన వివరించారు. 40 ఎంఎం మందం గల ల్యామినేటెడ్‌ గాజును ఉపయోగించి బ్రిడ్జి రూపొందించగా, ఈ గాజును ప్రత్యేకంగా జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఒక్కసారిగా 500 టన్నుల బరువును మోయగల సామర్థ్యం దీనికి ఉండగా, గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ఈ నిర్మాణం ఎలాంటి ప్రమాదం లేకుండా నిలబడగలదని అధికారులు తెలిపారు.

Visakhapatnam

పర్యాటకులు ఒకేసారి 40 మంది వరకు బ్రిడ్జిపైకి వెళ్లి కైలాసగిరి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు ఏర్పాట్లు చేశారు. నగర పర్వత ప్రాంతం మొత్తం కనిపించే ఈ గ్లాస్‌ బ్రిడ్జి, విశాఖలో పర్యాటక రంగానికి కొత్త ఊపు తీసుకువస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో కైలాసగిరిపై నిర్మిస్తున్న త్రిశూల్‌ ప్రాజెక్టును కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వీఎంఆర్డీఏ వెల్లడించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *