IND vs SA 1st ODI: టెస్టు సిరీస్‌లో ఎదురైన దారుణ ఓటమిని మరిచి, వైట్‌బాల్ ఫార్మాట్లో సత్తా చాటడానికి టీమిండియా సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు (ఆదివారం) రాంచీలో జరగనున్న తొలి మ్యాచ్‌తో భారత్, సౌతాఫ్రికా మధ్య పోరు ప్రారంభం కానుంది. కెప్టెన్, వైస్ కెప్టెన్ లేని లోటు, కీలక బౌలర్లకు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో… ఈ సిరీస్‌ను గెలిచి టెస్టు సిరీస్ వైట్ వాష్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.
సారథిగా కేఎల్ రాహుల్: కాంబినేషన్‌పై కోచ్ టెన్షన్
భారత జట్టుకు నాయకత్వ సమస్యలు వెంటాడుతున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా దూరమవడంతో, టీమిండియా వరుసగా మూడో అంతర్జాతీయ మ్యాచ్‌కి కేఎల్ రాహుల్ నాయకత్వంలో బరిలోకి దిగుతోంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి కీలక బౌలర్లకు విశ్రాంతి ఇవ్వడం వల్ల, రాహుల్ అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో జట్టును ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
రెగ్యులర్ ఆటగాళ్లు లేకపోవడంతో, తుది జట్టు కాంబినేషన్ ఎంపిక కోచ్ గౌతమ్ గంభీర్ మరియు స్టాండిన్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు పెద్ద సవాలుగా మారింది. టెస్టు సిరీస్‌లో ఓటమి కారణంగా ఇప్పటికే గంభీర్ ఎంపికలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వన్డే సిరీస్‌లో సానుకూల ఫలితం రాకపోతే, అతని పనితీరుపై మరిన్ని ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది.
రోకోపైనే అందరి దృష్టి
ఈ సిరీస్‌లో అందరి దృష్టి సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే ఉంది. వీరు ఇప్పుడు వన్డే ఫార్మాట్‌కు మాత్రమే పరిమితం కావడంతో, 2027 ప్రపంచ కప్ నాటికి వారి ఫిట్నెస్, ఫామ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ ఆరు వన్డేలు (సౌతాఫ్రికాతో 3, న్యూజిలాండ్‌తో 3) సెలెక్టర్లకు కీలకం కానున్నాయి.
ఇది కూడా చదవండి: Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుపాను.. ఏపీలోని ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు..
ఈ రాంచీ స్టేడియం రోహిత్ కెరీర్‌కు ఎంతో కీలకం. 2013లో ఇక్కడే అతను తొలిసారి పూర్తి స్థాయి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఆ మార్పు అతన్ని వైట్‌బాల్ క్రికెట్లో ‘హిట్‌మ్యాన్’గా మార్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో సెంచరీతో అదరగొట్టిన రోహిత్, అదే జోరును ఇక్కడ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. కింగ్ కోహ్లీ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు.
అంచనా భారత తుది జట్టు:
ఓపెనర్‌గా గిల్ స్థానంలో యశస్వి జైస్వాల్ రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. తిలక్ వర్మ నిలకడగా రాణిస్తుండడంతో, రుతురాజ్ గైక్వాడ్‌తో పోటీ ఉన్నప్పటికీ అతనికి చోటు దక్కవచ్చు. మిడిలార్డర్లో స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ లేదా పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్ రెడ్డికి అవకాశం దక్కే అవకాశం ఉంది. రాహుల్ కీపింగ్ చేస్తే రిషబ్ పంత్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా కీలకం కానున్నారు.
ఉత్సాహంతో సౌతాఫ్రికా
టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో సౌతాఫ్రికా జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. రెగ్యులర్ బౌలర్లు రబాడ, నార్జ్ లేకపోయినా, భారత్‌ను వైట్‌వాష్ చేసిన ఊపు వన్డే సిరీస్‌లో తమకు ఉపయోగపడుతుందని కెప్టెన్ టెంబా బవూమ నమ్ముతున్నాడు. ఐడెన్ మార్క్రమ్, బవూమ తిరిగి వన్డే టీమ్‌లోకి రావడంతో వారి బ్యాటింగ్ లైనప్ బలంగా మారింది. డికాక్, బ్రెవిస్‌లు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు.
ముఖ్యంగా, కొత్త ప్లేయర్ మాథ్యూ బ్రీట్జ్కేపై భారీ అంచనాలున్నాయి. అరంగేట్రం చేసిన తొలి ఐదు ఇన్నింగ్స్‌లలో 50 అంతకంటే ఎక్కువ రన్స్ చేసిన రికార్డు అతని సొంతం. 67.75 సగటుతో ఆడుతున్న మాథ్యూ భారత బౌలర్లకు సవాల్ విసిరే అవకాశం ఉంది.
పిచ్ రిపోర్ట్: రాంచీలో బ్యాటింగ్‌కు సవాలు
రాంచీ గ్రౌండ్లో ఇప్పటివరకు కేవలం 5 వన్డేలు మాత్రమే జరిగాయి. ఈ పిచ్ సాధారణంగా స్లోగా ఉండి, బ్యాటింగ్‌కు అంత సులభంగా ఉండదు. ఇక్కడ 300+ స్కోరు ఒక్కసారే నమోదైంది. 270–280 టార్గెట్‌ను ఛేజ్ చేయడం కూడా ఇక్కడ కష్టమే. మంచు ప్రభావం లేకపోతే మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు కొంత అనుకూలత లభిస్తుంది.
