IBomma Ravi: ఇంటర్నెట్లో సినిమాలను ఉచితంగా అందించే ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్ల వెనుక ఉన్న రవి అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి కఠినంగా విచారించారు. ఈ విచారణలో రవి అనేక కీలక విషయాలను వెల్లడించినట్టు సమాచారం. ముఖ్యంగా, తను ఉపయోగించిన ఈమెయిల్ అకౌంట్లను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పూర్తిగా సహకరించాడని తెలుస్తోంది.
21,000 పైగా సినిమాల పైరసీ – ఓటీటీ కాపీలు సైతం
పోలీసులు గుర్తించిన వివరాల ప్రకారం, రవి నడుపుతున్న ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లలో దాదాపు 21,000 కంటే ఎక్కువ సినిమాలు పైరసీకి గురైనట్టు తేలింది. వీటిలో చాలా సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైన వెంటనే కాపీ చేసినవి ఉన్నాయి. సినిమా రికార్డింగ్ క్వాలిటీ ఏ మాత్రం తగ్గకుండా ఉండేందుకు రవి ప్రత్యేక ప్రయత్నాలు చేశాడని, ఈ విషయంలో కరీబియన్ దీవుల్లో ఉన్న ఔట్సోర్సింగ్ కంపెనీలతో సైతం ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు పోలీసులకు చెప్పాడు.
పేరు వెనుక అసలు కథ ఇదే!
రవి తన వెబ్సైట్ల పేర్ల వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను కూడా వివరించాడు. తన పూర్తి పేరును “ఇంటర్నెట్ బొమ్మ”గా చెప్పాడు. విశాఖపట్నం ప్రాంతంలో సినిమాలను ‘బొమ్మ’ అని పిలిచేవారని, అందుకే ఇంటర్నెట్లో సినిమాలను చూపించడం వల్ల ‘ఐబొమ్మ’ అనే పేరు పెట్టినట్టు వెల్లడించాడు.
ఇక, రెండో వెబ్‌సైట్‌కు మొదట ‘బలపం’ అనే పేరు పెట్టాలని అనుకున్నాడు. కానీ డొమైన్ పేరు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో సాంకేతిక కారణాల వల్ల ‘L’ అనే అక్షరాన్ని తొలగించాల్సి వచ్చింది. ఆ విధంగానే అది ‘బప్పం’ గా మారిందని రవి స్పష్టం చేశాడు.
టెలిగ్రామ్ నుంచి సినిమాలు
తాను అప్లోడ్ చేసిన సినిమా కాపీలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలను కూడా రవి పోలీసులకు అందించాడు. ఇవన్నీ టెలిగ్రామ్ గ్రూపులు వంటి సోషల్ మీడియా వేదికల నుంచి సేకరించినవేనని తెలిపాడు. రవి అందించిన ఈ వివరాలతో, పైరసీ వెనుక ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వెబ్సైట్ల నిర్వహణ విధానాలపై పోలీసులు లోతుగా పరిశోధన చేస్తున్నారు.

