Addanki Dayakar: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ సాధన కోసం 1200 మందికి పైగా అమరవీరులు చేసిన త్యాగాల కంటే కేసీఆర్ దీక్షను గొప్పగా చూపించుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ దీక్ష ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలుసని, దాన్ని అనవసరంగా మహోన్నతంగా చూపించడానికి బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ప్రయత్నం దారుణమని దయాకర్ మండిపడ్డారు.
అమరవీరుల త్యాగాలను విస్మరించడం సరైంది కాదు
తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి, యాదయ్య, ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య వంటి అమరవీరుల త్యాగాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి మహోన్నత త్యాగాలను పక్కనపెట్టి, కేవలం కేసీఆర్ దీక్షను మాత్రమే ప్రచారం చేసుకోవడం బీఆర్‌ఎస్ నాయకుల రాజకీయ నాటకంగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్ దీక్షపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేస్తే కేటీఆర్ అంతగా కోపం తెచ్చుకోవడం ఎందుకని దయాకర్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో మహేష్ గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించారని, సాగరహారం రోజున కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉన్నారని కూడా దయాకర్ నిలదీశారు.
కేసీఆర్‌ది అవకాశవాద రాజకీయం: దయాకర్
బీఆర్‌ఎస్ నాయకత్వంపై దయాకర్ మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్‌ను విలీనం చేయడానికి కేసీఆర్ అవకాశవాద రాజకీయాల వల్లే అడ్డుపడ్డారని ఆరోపించారు. అంతేకాకుండా, తెలంగాణ ఉద్యమంలో కీలకమైన మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. గద్దర్, కోదండరాం వంటి గొప్ప ఉద్యమకారులకు కేసీఆర్ నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వలేదని, చివరికి శ్రీకాంతాచారి త్యాగాన్ని కూడా బీఆర్‌ఎస్ సరిగా గుర్తు చేసుకోదని ఆయన ఎత్తిచూపారు.
సోనియా గాంధీని అవమానించారు
తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ వల్లే ఏర్పడిందని కేసీఆర్ గతంలో అనేకసార్లు చెప్పారని, కానీ తర్వాత కాలంలో అదే సోనియా గాంధీని అవమానించడం కేసీఆర్ స్వభావానికి నిదర్శనమని దయాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా చంపడానికి కేసీఆర్ ప్రయత్నించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అనేది సోనియా గాంధీకి తెలంగాణ ఇచ్చిన బహుమతి అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ తన పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చిన రోజే తెలంగాణ ఆత్మ చనిపోయిందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి పాలనలో మానవత్వం
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు గొప్ప గౌరవం ఇస్తున్నారని దయాకర్ తెలిపారు. ఇటీవల అందె శ్రీ అంత్యక్రియల సందర్భంగా రేవంత్ రెడ్డి చూపించిన మానవత్వం అందరిని ఆకట్టుకుందని కొనియాడారు. కేసీఆర్ మాత్రం ఉద్యమకారులను జైల్లో పెట్టిన చరిత్ర ఉందని విమర్శించారు. కేటీఆర్ రాజీవ్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని దయాకర్ గట్టిగా హెచ్చరించారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ‘420 ముద్ర’ ఉన్న నాయకులు మాత్రమే మిగిలారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల రుణం తీర్చుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారని, ఆయన పాలన మానవతా స్పూర్తిని ప్రతిబింబిస్తోందని దయాకర్ ముగించారు.

