IBomma Ravi: సంచలనం సృష్టించిన ఐ-బొమ్మ వెబ్‌సైట్ కేసులో ఆ వెబ్‌సైట్‌ను నడుపుతున్న ఇమంది రవిని పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవిని ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు విచారించనున్నారు. గతంలో ఐదు రోజుల పాటు విచారించిన పోలీసులు అతని నుంచి కొన్ని ముఖ్యమైన ఆధారాలను సేకరించినప్పటికీ, కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు.
ముఖ్యంగా, రవికి సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు పూర్తి స్థాయిలో లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఈ వివరాలు తెలుసుకునేందుకు, కేసులోని ఇతర అంశాలపై మరింత స్పష్టత కోసం అతడిని మళ్లీ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు రవిని చంచల్‌గూడ జైలు నుంచి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మూడు రోజుల్లో రవి బ్యాంకు లావాదేవీల గురించి, అలాగే ఈ వెబ్‌సైట్‌ను నడపడానికి అతనికి సహాయం చేసిన నెట్‌వర్క్ గురించి పోలీసులు మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. ఈ అక్రమ కార్యకలాపాల వెనుక ఉన్న మొత్తం వ్యవస్థను బయటపెట్టడంపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు.
