Karimnagar

Karimnagar: దుబాయిలో రెండేళ్లుగా ఆచూకీ లేదు.. భర్త కోసం కలెక్టర్‌కు మొరపెట్టుకున్న భార్య!

Karimnagar: ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని దుబాయికి వెళ్లిన భర్త రెండేళ్లుగా కనిపించకపోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, గునుకులకొండాపూర్‌కు చెందిన చొక్కాల శ్రీధర్ ఆచూకీ తెలియక, ఆయన భార్య, తల్లి తల్లడిల్లిపోతున్నారు. సోమవారం రోజున కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వారు కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీధర్, ఆయన భార్య సీహెచ్. అఖిలకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారి మెరుగైన భవిష్యత్తు కోసం శ్రీధర్ 2022 సంవత్సరంలో అప్పు చేసి దుబాయికి వలస వెళ్లారు. అక్కడ చిన్నాచితక పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే, 2023 సంవత్సరం నుంచి శ్రీధర్ ఫోన్ నంబరు పనిచేయడం మానేసింది. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి: National Highway Projects: తెలంగాణలో 4 కీలక జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం ఆమోదం..

“మా కళ్లలో వత్తులేసుకొని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాం. నా భర్త ఆచూకీ కనుక్కోవాలని రాష్ట్ర, కేంద్ర మంత్రులను కూడా కలిశాం. ఎక్కడికి వెళ్లినా నిరాశే మిగిలింది.” – శ్రీమతి అఖిల (శ్రీధర్ భార్య)

భార్య అఖిల, తల్లి రమ, సోమవారం కలెక్టర్‌ను కలిసి, తమ భర్త/కుమారుడు ఆచూకీ కనుగొనడానికి ఉన్నతాధికారులతో మాట్లాడాలని వేడుకున్నారు. తమకు న్యాయం చేయాలని, శ్రీధర్‌ను క్షేమంగా తిరిగి తీసుకురావడానికి కృషి చేయాలని వారు కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడి, ఈ విషయాన్ని విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *