TG Colleges

TG Colleges: కొత్త కాలేజ్ బిల్డింగ్స్.. స్మార్ట్ క్లాస్ రూమ్స్..కొత్త ఫర్నీచర్స్

TG Colleges: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల రూపురేఖలను సమూలంగా మార్చేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు అందుతుండటంతో సర్కారు కాలేజీల్లో విద్యార్థుల అడ్మిషన్లు ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో, విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

కొత్త భవనాలు, మెరుగైన వసతులు

రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రభుత్వ జూనియర్ కాలేజీలు శిథిలావస్థకు చేరిన పాత భవనాల్లో, చాలీచాలని తరగతి గదులతో నడుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు, అవసరమైన చోట్ల కొత్త బిల్డింగులను నిర్మించాలని ఇంటర్మీడియెట్ విద్యాశాఖ నిర్ణయించింది.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 10 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతుల కల్పన కోసం మొత్తం రూ. 117.30 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు.

ఇది కూడా చదవండి: Teja Sajja: తేజ సజ్జ నుంచి మరో దేవుడి కథ..?

ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా కింద 60% (రూ. 70.38 కోట్లు), రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 40% (రూ. 46.92 కోట్లు) ఉండనున్నాయి.

ఈ నిధులతో కేవలం భవన నిర్మాణాలే కాకుండా, విద్యార్థుల కోసం స్మార్ట్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్లు, ఆధునిక ఫర్నిచర్ వంటి సౌకర్యాలు కల్పించేందుకు కూడా ప్రతిపాదనలు రూపొందించారు.

నాంపల్లిలో ‘హైటెక్ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్’

ఈ పది కాలేజీల ప్రతిపాదనల్లో హైదరాబాద్‌లోని నాంపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ (బాయ్స్), ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కాలేజీకి అత్యధిక నిధులు కేటాయించారు. ఒకే ఆవరణలో నడుస్తున్న ఈ రెండు కాలేజీలకు కలిపి రూ. 27.30 కోట్లతో ఒకే ‘ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్’ కట్టాలని ప్రతిపాదించారు.

నాంపల్లి కాకుండా మిగిలిన తొమ్మిది కాలేజీలకు ఒక్కో దానికి సుమారు రూ. 10 కోట్లు చొప్పున, ఇతర వసతుల కోసం అదనంగా రూ. 8 కోట్లు కేటాయించాలని అధికారులు కోరారు.

ఎంపిక చేసిన కాలేజీల వివరాలు:

ప్రారంభ దశలో ఆధునికీకరణకు ఎంపిక చేసిన ప్రభుత్వ జూనియర్ కాలేజీల జాబితా ఇది:

జిల్లా కాలేజీ పేరు రకం
హైదరాబాద్ జీజేసీ (బాయ్స్) అండ్ జీవీజేసీ, నాంపల్లి ఇంటిగ్రేటెడ్
హైదరాబాద్ జీజేసీ ఫలక్ నుమా (బాయ్స్ అండ్ గర్ల్స్) బాయ్స్ & గర్ల్స్
హైదరాబాద్ ఎంఏఎం జీజేసీ గర్ల్స్, నాంపల్లి గర్ల్స్
హైదరాబాద్ జీజేసీ, బోరబండ జనరల్
నల్గొండ జీజేసీ గర్ల్స్, నల్గొండ గర్ల్స్
ఆదిలాబాద్ జీజేసీ బాయ్స్, ఆదిలాబాద్ బాయ్స్
నిర్మల్ జీజేసీ, భైంసా జనరల్
నిర్మల్ జీజేసీ, ముధోల్ జనరల్
మహబూబ్ నగర్ జీజేసీ గర్ల్స్, మహబూబ్ నగర్ గర్ల్స్
నిజామాబాద్ జీజేసీ బాయ్స్, నిజామాబాద్ బాయ్స్

ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు ఈ ప్రతిపాదనలు పూర్తిస్థాయిలో అమలు జరిగితే మెరుగైన విద్యా వాతావరణం, అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *