Hyderabad: తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన వారి వాట్సాప్ గ్రూపులు టార్గెట్ అవడంతో ఆందోళన నెలకొంది. తాజాగా, తెలంగాణ సీఎంవోకు చెందిన వాట్సాప్ గ్రూప్‌తో పాటు పలువురు మంత్రులకు సంబంధించిన మీడియా గ్రూప్‌లను హ్యాక్ చేసిన ఘటన బయటపడింది.
కేటుగాళ్లు ఎస్బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేషన్ పేరుతో ప్రమాదకర ఏపీకే ఫైళ్లను షేర్ చేస్తున్నారు. ఈ ఫైళ్లను ఓపెన్ చేసి అప్డేట్ చేసుకోవాలంటూ, SBI పేరుతో సందేశాలు పంపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది.
సైబర్ నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. తెలియని మూలాల నుంచి వచ్చే లింకులు, ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కీలక గ్రూప్‌లు కూడా హ్యాకర్ల టార్గెట్ అవడం భద్రతా లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఇదిలా ఉండగా, కేవలం ఎనిమిది రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే. కోర్టు ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేసే సమయంలో వినియోగదారులు ఒక గేమింగ్ సైట్‌కు రీడైరెక్ట్ కావడంతో సైబర్ దాడి వెల్లడైంది. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్, రాష్ట్ర డీజీపీకి అధికారిక ఫిర్యాదు చేశారు.
