Kavita: మాజీ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రమైన ఆరోపణలు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని పలు చెరువులపై సబితా అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని కవిత ఆరోపించింది. ఎన్నో ఫిర్యాదులు వచ్చినా సబితా ఇంద్రారెడ్డి స్పందించకపోవడం దురదృష్టకరమని ఆమె మండిపడ్డారు.
“సబితా అనుచరులే చెరువులను ఆక్రమిస్తున్నారు”
కవిత మాట్లాడుతూ—
“మహేశ్వరం పరిధిలోని రావిర్యాల, మంత్రాల చెరువులలో అక్రమ కబ్జాలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ సబితా ఇంద్రారెడ్డి అనుచరుల వ్యహారాలు. ఈ విషయంపై ఆమె నుంచి ఒక్క స్పందన కూడా లేకపోవడం చాలా దారుణం” అని విమర్శించారు.
హైడ్రా చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి
ఈ కబ్జాల గురించి అధికారులు తెలుసు కానీ హైడ్రా (HYDRA) కూడా పట్టించుకోవడం లేదని కవిత ఆరోపించింది.
“హైడ్రా ఎందుకు మౌనం పాటిస్తోంది? ప్రజలకు సంబంధించిన చెరువులపై ఇలా బలవంతపు ఆక్రమణలు జరిగితే చర్యలు ఎవరు తీసుకోవాలి?” అని ఆమె ప్రశ్నించారు.
కబ్జాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో హైడ్రాకు సమర్పిస్తామని, తర్వాత వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రజల ముందే వెల్లడిస్తామని కవిత వెల్లడించారు.
“బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో సంప్రదింపుల్లో ఉన్నారు”
సబితా ఇంద్రారెడ్డి వివాదానికి సంబంధించి మాట్లాడుతూ, కవిత మరో సంచలన వ్యాఖ్య చేసింది.
“కబ్జాలపై ఆధారాలు హైడ్రాకు ఇస్తే… బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్లిపోతారేమో అనిపిస్తోంది” అని విమర్శించారు.
అదేవిధంగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు–ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తమకు సమాచారం ఉందని ఆమె పేర్కొన్నారు.
