Encounter in AP: ఏపీలో మరో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఏపీ-ఒడిశా సరిహద్దులోని (AOB) మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. గ్రేహౌండ్స్ దళాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భారీ ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది.
మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేత దేవ్‌జీ కూడా ఉన్నట్లు సమాచారం. దేవ్‌జీతో పాటు మరికొందరు ముఖ్యమైన మావోయిస్టులు ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందారని పోలీసులు ప్రాథమికంగా ధృవీకరించారు. ఈ ఎన్‌కౌంటర్ వివరాలను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఏడీజీ లడ్డా అధికారికంగా ధృవీకరించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Maanya Anand: కమిట్‌మెంట్ ఇస్తే సినిమా ఇస్తానన్నాడు.. ధనుష్ మేనేజర్‌పై మాన్య ఆనంద్ ఆరోపణలు
అటవీ ప్రాంతంలో మరికొంత మంది మావోయిస్టులు తలదాచుకుని ఉండే అవకాశం ఉందని భావించి, గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్‌ను మరింత ముమ్మరం చేశాయి. మృతి చెందిన మావోయిస్టుల వివరాలు, వారి పూర్తి గుర్తింపునకు సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
