Rajamouli

Rajamouli: రాజమౌళిపై కేసు నమోదు: హనుమంతుడిపై వ్యాఖ్యల వివాదం

Rajamouli: దేశంలోని అగ్ర దర్శకులలో ఒకరైన ఎస్.ఎస్. రాజమౌళి తాజాగా రెండు వివాదాల్లో చిక్కుకున్నారు. మహేష్ బాబుతో తాను చేయబోయే సినిమా టైటిల్‌ ‘వారణాసి’ పేరు వెల్లడి కార్యక్రమం సందర్భంగా ఆయన హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు హిందూ సంఘాల మనోభావాలను దెబ్బతీశాయంటూ ఫిర్యాదు నమోదైంది. మరోవైపు, ఈ సినిమా టైటిల్‌ ‘వారణాసి’ విషయంలోనూ మరో నిర్మాత అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు.

హనుమంతుడిపై వ్యాఖ్యలు: సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు
రాజమౌళి ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘వారణాసి’ (టైటిల్ రివీల్) ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆయన కొంత అసహనానికి గురయ్యారు. ఈ సందర్భంగా స్టేజీపై మాట్లాడిన రాజమౌళి… హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.o

ఆయన మాట్లాడుతూ, “నాకు దేవుడిపై నమ్మకం లేదు. మా నాన్న (విజయేంద్రప్రసాద్) ‘టెన్షన్ పడకు, హనుమంతుడు వెనకుండి నడిపిస్తాడు’ అని చెప్పారు. కానీ ఈ సాంకేతిక సమస్య వచ్చినప్పుడు, ఇలాగేనా నడిపించేది అని నాకు కోపం వచ్చింది. నా భార్య రమాకు హనుమంతుడంటే చాలా ఇష్టం, ఆయనను ఆమె స్నేహితుడిలా భావిస్తుంది. ఆమె మీద కూడా నాకు కోపం వచ్చింది” అని అన్నారు.

రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొంటూ రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఎవరూ హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా రాజమౌళిపై కేసు నమోదు చేయాలని వారు పోలీసులను కోరారు.

Also Read: Deepika Padukone: దీపికపై మళ్ళీ రెచ్చిపోతున్న ప్రభాస్ ఫ్యాన్స్?

వారణాసి’ టైటిల్‌పై ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు
హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యల వివాదం ఒకవైపు ఉండగా, రాజమౌళి సినిమా టైటిల్‌ ‘వారణాసి’ కూడా చిక్కుల్లో పడింది. ఈ టైటిల్‌ను తాము చాలా కాలం క్రితమే రిజిస్టర్ చేసుకున్నామని పేర్కొంటూ, ‘రఫ్’ సినిమా దర్శకుడు సి.హెచ్. సుబ్బారెడ్డికి చెందిన రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు.

తమ అనుమతి లేకుండా వేరొకరు ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న టైటిల్‌ను రాజమౌళి ఎలా ప్రకటించారని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా వారు ఛాంబర్‌కు సమర్పించారు. మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే చిత్రం పేరు ప్రకటించిన వెంటనే, వరుసగా రెండు పెద్ద వివాదాలు చుట్టుముట్టడంతో ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఈ అంశం చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *