Potato: బంగాళాదుంపలు చాలా మంది ఇష్టపడే ఆహారం అయినప్పటికీ, వీటిని అధికంగా తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఆలూలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6 వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, వీటిని పరిమితికి మించి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. బంగాళాదుంపలను ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి; ముఖ్యంగా కడుపు ఉబ్బరం, గ్యాస్ ఏర్పడి తీవ్రంగా ఇబ్బంది పడతారు. అంతేకాక, వీటిని అధికంగా తీసుకోవడం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది.
Also Read: Black Coffee: మార్నింగ్ బ్లాక్ కాఫీ తాగుతున్నారా.. బెనిఫిట్స్ తో పాటు నష్టాలు కూడా ఉన్నాయి
బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల ఆలూలో సుమారు 20.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1.9 గ్రాముల ప్రొటీన్, 1.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ అధిక కార్బోహైడ్రేట్ల కారణంగా ఆలూను తరచుగా, అధికంగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బంగాళాదుంపలను డీప్ ఫ్రై చేసి తినడం, చిప్స్ తినడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే వేయించిన వాటిలో క్యాలరీలతో పాటు కొవ్వు శాతం, ట్రాన్స్ ఫ్యాట్ కూడా పెరుగుతుంది. ఫలితంగా బరువు వేగంగా పెరుగుతారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారు ఆలుగడ్డలకు దూరంగా ఉండడం ఉత్తమం.
మధుమేహం (డయాబెటిస్), అధిక రక్తపోటు (బీపీ) వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు పూర్తిగా తినకుండా ఉంటేనే మంచిది. వీటిలోని అధిక కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. అందుకే డయాబెటిస్ పేషెంట్లు తప్పనిసరిగా డైటీషియన్ సూచనల ప్రకారమే బంగాళాదుంపలను తినాలి. బంగాళాదుంపలను అతిగా తింటే ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు కూడా వేధిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఆలూను ఉడకబెట్టి లేదా ఆవిరిపై వండుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని కానీ ఎంత మంచిదైనా, వీటిని మితంగా (రోజుకు 25-50 గ్రాములు) మాత్రమే తీసుకోవడం ఆరోగ్యానికి సురక్షితం.

