Pawan Kalyan: తెలుగు సినీ పరిశ్రమకు గుడ్ న్యూస్! పైరసీ భూతాన్ని తరిమికొట్టడంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గొప్ప విజయం సాధించారు. సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఐబొమ్మ (iBomma), బప్పమ్ (Bappam) వెబ్‌సైట్ల వెనుక ఉన్న కీలక వ్యక్తిని అరెస్టు చేసి, వాటిని పూర్తిగా మూసివేయించారు. ఈ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా స్వాగతించారు, పోలీసు బృందాన్ని, ముఖ్యంగా సిటీ కమిషనర్ వి.సి. సజ్జనార్‌ను అభినందించారు.
తీవ్ర నష్టంలో చిత్ర పరిశ్రమ
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, సినిమా నిర్మాణం అంటే కేవలం డబ్బు పెట్టుబడి పెట్టడం మాత్రమే కాదు, సృజనాత్మకతను కూడా పెట్టుబడిగా పెడతారు. అయితే, సినిమాలు విడుదలైన రోజునే ఆన్‌లైన్‌లో ఉచితంగా లభిస్తుండడంతో, సినీ పరిశ్రమ కోట్లాది రూపాయల నష్టాన్ని చవిచూస్తోంది. ఒక సినిమా విడుదలను ‘మహాయజ్ఞం’గా భావించే దర్శకనిర్మాతలకు ఈ పైరసీ ముఠాలను అదుపు చేయడం అసాధ్యంగా మారింది. ఇలాంటి తరుణంలో, పోలీసులకు కూడా సవాల్ విసిరే స్థాయికి చేరిన ఈ పైరసీ మాఫియాపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చరిత్రాత్మకం అని ఆయన కొనియాడారు.
Also Read: Metro Stations: సీఎం కీలక నిర్ణయం.. మూడు మెట్రో స్టేషన్ల పేర్ల మార్పు..
నకిలీ సినిమాలకు కేంద్రంగా మారిన ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. రవిపై ఐటీ చట్టం, కాపీ రైట్ చట్టం కింద నాలుగు కేసులు నమోదు చేశారు. అతని హార్డ్ డిస్క్‌లో దాదాపు 21 వేల సినిమాలు ఉన్నాయని, సుమారు 50 లక్షల మంది యూజర్ల డేటా రవితో ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ అక్రమ దందా ద్వారా రవి ఏకంగా రూ. 20 కోట్లు సంపాదించినట్లు, అందులో రూ. 3 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సజ్జనార్ వివరించారు. ఈ పైరసీ భూతం ప్రపంచాన్ని వణికిస్తోందని కూడా ఆయన అన్నారు.
సజ్జనార్ కృషి అభినందనీయం
సీపీ సజ్జనార్ కేవలం సినీ పైరసీపైనే కాకుండా, బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ వంటి వాటిపైనా ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఈ మోసాల వల్ల ప్రజలు ఆర్థికంగా ఎలా నష్టపోతున్నారో ఆయన చైతన్యపరుస్తున్నారని తెలిపారు. బెట్టింగ్ యాప్స్‌ను నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం ఇతర రాష్ట్రాల్లో కూడా కదలిక తీసుకువచ్చిందని పవన్ గుర్తు చేశారు. సజ్జనార్ నేతృత్వంలో తీసుకునే చర్యలు కేవలం తెలుగు సినిమాకు మాత్రమే కాకుండా, యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని ఆయన బలంగా విశ్వాసం వ్యక్తం చేశారు.
