CP Sajjanar: తెలుగు చలనచిత్ర పరిశ్రమనే కాదు, బాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా సినీ రంగాన్ని వేల కోట్ల నష్టంలోకి నెట్టిన ‘పైరసీ’ భూతంపై హైదరాబాద్ పోలీసులు చరిత్రాత్మక విజయం సాధించారు. సంచలనం సృష్టించిన ‘ఐబొమ్మ’ (iBomma) వెబ్‌సైట్ ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని ఎట్టకేలకు పట్టుకోవడంలో సైబర్ క్రైమ్ పోలీసులు సఫలమయ్యారు.
ఈ కేసు వివరాలను వెల్లడించేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ గారు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సురేష్ బాబు, రాజమౌళి వంటి సినీ ప్రముఖులు సీపీ సజ్జనార్‌తో ప్రత్యేకంగా భేటీ అయి, పోలీసుల కృషిని ప్రశంసించారు.
దేశాలు దాటిన దందా, క్రిమినల్ మైండ్:
సీపీ సజ్జనార్ మీడియా ముందుంచిన వివరాలు ఇమ్మడి రవి నేర సామ్రాజ్యం ఎంత విస్తరించిందో స్పష్టం చేశాయి.
పైరసీని అరికట్టడానికి పోలీసులు ఎంతగా శ్రమించారో గుర్తుచేస్తూ, వేల కోట్ల నష్టానికి కారణమైన ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినట్లు సీపీ ప్రకటించారు. ఈ కేసులో ఇదివరకే దుద్దెల శివరాజ్, ప్రశాంత్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. రవిపై మొత్తం 5 కేసులు నమోదై ఉన్నాయి.
ఇమ్మడి రవి దందా కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. పైరసీకి సంబంధించిన సర్వర్‌లను అమెరికా, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఏర్పాటు చేశాడు. అంతేకాక, ఫ్రాన్స్, దుబాయ్, థాయిలాండ్ సహా ఎన్నో దేశాలు తిరిగాడు. అత్యంత ముఖ్యంగా, కరేబియన్ ఐల్యాండ్‌లో పౌరసత్వం (Citizenship) కూడా తీసుకున్నాడు.
ఇది కూడా చదవండి: CP Sajjanar: సినిమా పైరసీ చేసి.. ఇమ్మడి రవి రూ.20 కోట్లు సంపాదించాడు
నేరం చేసే ముందు నుంచే ఇమ్మడి రవికి క్రిమినల్ మైండ్ ఉందని సీపీ సజ్జనార్ తెలిపారు. మహారాష్ట్రలో ప్రహ్లాద్ అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటి నకిలీ పత్రాలు సృష్టించుకున్నాడు.
బెట్టింగ్‌కు పైరసీ ముసుగు: 50 లక్షల మంది డేటా ప్రమాదంలో!
ఇమ్మడి రవి కేవలం పైరసీతోనే ఆగలేదని, దాని ముసుగులోనే సమాజానికి మరింత హాని తలపెట్టాడని సీపీ సజ్జనార్ సంచలన విషయాలు బయటపెట్టారు:
రవి నుంచి పోలీసులు రూ. 3 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే, అతను ఏకంగా రూ. 20 కోట్ల వరకు సంపాదించినట్లు విచారణలో వెల్లడించాడు.
ఇమ్మడి రవి వద్ద 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా ఉంది. ఈ డేటాను అతను దుర్వినియోగం చేసే అవకాశం ఉండేదని, ఈ డేటా ‘డార్క్ వెబ్’కు చేరే ప్రమాదం కూడా ఉందని సీపీ హెచ్చరించారు.
పైరసీ వెబ్‌సైట్ ద్వారా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి యువత భవిష్యత్తును నాశనం చేశాడని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. “బెట్టింగ్ యాప్‌ల వల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తల్లిదండ్రులు కడుపుకోత మిగిలింది,” అని ఆయన తీవ్రంగా స్పందించారు.
