Delhi Bomb Blast

Delhi: ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రపంచ దేశాల స్పందన ఇదే..!

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన భయానక కారు పేలుడు దేశాన్ని కుదిపేసింది. చారిత్రక ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో హర్యానా రిజిస్ట్రేషన్ గల కారులో అకస్మాత్తుగా జరిగిన భారీ పేలుడు వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. వెంటనే పోలీసులు, ఫైరింగ్ సిబ్బంది, వైద్య బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.

ఈ ఘటనపై ప్రపంచ దేశాల నుంచి భారత్‌కు సంఘీభావం వెల్లువెత్తింది. పలు దేశాల నాయకులు, రాయబారులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, భారత ప్రజలకు మద్దతు ప్రకటించారు.

ఐర్లాండ్ ఉప ప్రధాని సైమన్ హారిస్ మాట్లాడుతూ – “ఢిల్లీలో జరిగిన ఈ విషాదకర ఘటన మనసును కలిచివేసింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. ఈ కష్ట సమయంలో భారత్‌కు మేము అండగా ఉంటాం” అని పేర్కొన్నారు.

భారత్‌లో చైనా రాయబారి జు ఫీహాంగ్ కూడా బాధను వ్యక్తం చేస్తూ – “ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు హృదయాన్ని కలచివేసింది. బాధితుల కుటుంబాల పట్ల నా సానుభూతి” అని తెలిపారు.

జర్మనీ రాయబారి ఫిలిప్ అకర్‌మాన్ మాట్లాడుతూ – “ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో – “భారత్‌లో జరిగిన ఈ విషాదం పట్ల మేము దిగ్భ్రాంతి చెందాము. బాధితుల కుటుంబాలకు మా సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం” అని తెలిపింది

యూకే కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ప్రీతి పటేల్ కూడా స్పందిస్తూ, “ఢిల్లీ పేలుడు ఘటన భయానకంగా ఉంది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. ఢిల్లీలో ఉన్న బ్రిటిష్ పౌరులకు అవసరమైన సహాయం అందించాలని యూకే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అన్నారు.

ఇదిలా ఉండగా, ఈ పేలుడు వెనుక ఉన్న కారణాలను గుర్తించేందుకు భారత దర్యాప్తు సంస్థలు (NIA) సుదీర్ఘ విచారణ ప్రారంభించాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.

ప్రపంచ దేశాల నుంచి వస్తున్న సంఘీభావం భారత్‌కు ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *