Mexico: నార్త్‌వెస్ట్ మెక్సికోలోని హెర్మోసిల్లో నగరంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సిటీ సెంటర్లో ఉన్న ‘వాల్డో సూపర్‌మార్కెట్’ లో భారీ పేలుడు సంభవించడంతో భవనం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 23 మంది మరణించగా, మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
మృతుల్లో మైనర్లు, గర్భిణీలు:
సోనోరా రాష్ట్రంలోని ఈ సూపర్మార్కెట్లో జరిగిన ఈ ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. మరణించిన 23 మందిలో 8 మంది మైనర్లు ఉన్నారు. వీరిలో నలుగురు బాలురు, ఇద్దరు బాలికలతో పాటు ఇద్దరు గర్భిణీలు, వృద్ధులు కూడా ఉన్నట్లు స్థానిక రెడ్ క్రాస్ ప్రతినిధులు ధృవీకరించారు. మరణించిన వారిలో 12 మంది మహిళలు, ఐదుగురు పురుషులు కూడా ఉన్నారు.
అగ్నిప్రమాదమే ప్రధాన కారణం:
పేలుడు సంభవించిన వెంటనే భవనంలో భారీ మంటలు దట్టమైన పొగలు వ్యాపించాయి. మార్కెట్ ముందు పార్క్ చేసిన ఒక కారు కూడా తగలబడింది. ఈ విషాదానికి ప్రధానంగా అగ్నిప్రమాదమే కారణమని రాష్ట్ర అటార్నీ జనరల్ గుస్తావో సాలాస్ ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్నిప్రమాదం కారణంగా వెలువడిన విషపూరిత వాయువులను పీల్చడం వల్లే ఎక్కువ మంది మరణించినట్లు ఆయన తెలిపారు. అయితే, ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు, కానీ కొన్ని మీడియా కథనాల ప్రకారం ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ కారణంగా మంటలు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన వెనుక హింసాత్మక కోణం లేదా దాడికి సంబంధించిన అంశం ఏదీ లేదని అధికారులు స్పష్టం చేశారు.
Also Read: jubliee hills By elections 2025: జూబ్లీహిల్స్‌లో కేకే సర్వే నిజమవుతుందా? బెడిసికొడుతుందా?
ఈ దుర్ఘటనపై సోనోరా రాష్ట్ర గవర్నర్ అల్ఫోన్సో డురాజో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల సంఖ్యను 23గా ఆయన ధృవీకరించి, ఇది ‘విషాదకరమైన రోజు’ అని అభివర్ణించారు. బాధితుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గవర్నర్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు, మెక్సికో అధ్యక్షుడు క్లాడియా షీన్బామ్ కూడా ఈ విషాద ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధితులు, క్షతగాత్రులకు సహాయం అందించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని పంపాలని అంతర్గత వ్యవహారాల కార్యదర్శి రోసా ఇసెలా రోడ్రిగెజ్‌ను ఆమె ఆదేశించారు.
స్థానికులు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సహాయక చర్యల్లో సోనోరా రెడ్ క్రాస్‌కు చెందిన 40 మంది సిబ్బంది, 10 అంబులెన్స్‌లు పాల్గొని గాయాలైన వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించాయి. కాగా, మెక్సికోలో ఏటా అక్టోబరు 31 నుంచి నవంబరు 2 వరకు మరణించిన ప్రియమైన వారిని గుర్తుచేసుకుంటూ ‘డే ఆఫ్ ది డెడ్’ అనే పండుగ జరుపుకునే సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడం ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

