Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “భారత్ ఫ్యూచర్ సిటీ” లో ఏర్పాటు కానున్న అమెజాన్ డేటా సెంటర్‌కు (Amazon Data Center) సీఎం బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడానికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రూ.60,000 కోట్ల అమెజాన్ ప్రాజెక్టు.. ఫ్యూచర్ సిటీ టార్గెట్స్!
ఫ్యూచర్ సిటీలో సుమారు రూ.60,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. రాబోయే 14 ఏళ్లలో అమెజాన్ సంస్థ 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉందని సీఎం తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత ఆధునిక నగరంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతున్నామని, ప్రపంచ ప్రసిద్ధ ‘ఫార్చూన్–500’ లిస్ట్‌లో ఉన్న కంపెనీలను ఇక్కడికి ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గత ఏడాది జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో 108 దేశాల ప్రతినిధులను ఇందుకోసం ఆహ్వానించినట్లు గుర్తుచేశారు.
పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని రకాల పర్మిషన్లను సింగిల్ విండో విధానంలో చాలా వేగంగా ఇస్తున్నామని, 2025 డిసెంబర్‌లో ఇందుకోసం కొత్త పాలసీని కూడా తీసుకొచ్చామని సీఎం వెల్లడించారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపై తానే స్వయంగా ప్రతి నెలా రివ్యూ చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ ఆర్థిక లక్ష్యం: 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ!
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు.
2047 నాటికి భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంటే.. అందులో తెలంగాణ వాటా కనీసం 10 శాతం ఉండేలా తాము కృషి చేస్తున్నామని సీఎం వివరించారు.
కాలుష్య రహిత హైదరాబాద్.. ఈవీ (EV) వాహనాలకు జీరో టాక్స్!
హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం లేని క్లీన్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం కొన్ని కఠినమైన, ఆధునిక నిర్ణయాలు తీసుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు..
-
పరిశ్రమల తరలింపు & మూసీ ప్రాజెక్ట్: నగర ప్రజల ఆరోగ్యం కోసం సిటీలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను క్రమంగా బయటకు తరలిస్తామని, అలాగే మూసీ నది సుందరీకరణ పనులను వేగవంతం చేస్తామని చెప్పారు.
-
మెట్రో & గ్రీన్ బస్సులు: నగరంలో మెట్రో రైలు నెట్‌వర్క్‌ను భారీగా విస్తరిస్తామన్నారు. డీజిల్, ఇంధనంతో నడిచే ఆర్టీసీ బస్సులను దశలవారీగా సిటీ శివార్లకు పరిమితం చేసి.. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను (EV) ప్రవేశపెడతామన్నారు. అలాగే నగరంలోని 2 లక్షల ఆటోలను కూడా డీజిల్ నుండి ఈవీలుగా మారుస్తామన్నారు.
-
ఈవీలపై బంపర్ ఆఫర్: రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నామని.. తెలంగాణలో ఎవరైనా సరే కొత్తగా ఎలక్ట్రిక్ వాహనం (EV) కొనుగోలు చేస్తే ‘జీరో టాక్స్’ (ఎలాంటి పన్ను ఉండదు) విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
