Sanae Takaichi: దశాబ్దాల పురుషాధిక్యత కలిగిన జపాన్ రాజకీయ ముఖచిత్రంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP)కి చెందిన ప్రముఖ నాయకురాలు సనాయే తకాయిచి (64) దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ప్రధాని షిగెరు ఇషిబా అంతర్గత ఒత్తిడి, పార్లమెంట్‌లో మెజారిటీ కోల్పోవడం వల్ల రాజీనామా చేయగా, ఆయన స్థానంలో సనాయే తకైచి ఈ అత్యున్నత పదవిని చేపట్టారు.
అక్టోబర్ 4న జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో, మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కోయిజుమితో సహా మరో ముగ్గురు అభ్యర్థులను ఓడించి సనాయే తకాయిచి విజయం సాధించారు. ఈ గెలుపు బాధ్యతను పెంచిందని ఆమె పేర్కొన్నారు. అనంతరం మంగళవారం (అక్టోబర్ 21) జపాన్ పార్లమెంట్‌లోని దిగువ సభ (లోయర్ హౌస్)లో జరిగిన ఓటింగ్‌లో 465 ఓట్లకుగానూ 237 ఓట్లు సాధించి ఆమె ప్రధానమంత్రిగా ఎన్నిక ఖరారు చేసుకున్నారు. ఎల్‌డీపీ – జపాన్ ఇన్నోవేషన్ పార్టీ కూటమి మద్దతుతో ఈ విజయం సాధ్యమైంది.
సనాయే తకైచి జపాన్ రాజకీయ వర్గాలలో ‘ఐరన్ లేడీ ఆఫ్ జపాన్’ అనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె అనుసరించే అతివాద, పటిష్టమైన ఆర్థిక, జాతీయ భద్రతా విధానాల కారణంగా ఈ బిరుదు లభించింది. ఆమె 1993లో నారా నుంచి తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అంతకుముందు ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రి వంటి పలు కీలక పదవుల్లో పనిచేశారు.
Also Read: Viral News: పూణే కోటలో నమాజ్.. గోమూత్రంతో శుద్ధి చేసిన ఎంపీ
భారత్-జపాన్ బంధంపై మోదీ శుభాకాంక్షలు
జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన సనాయే తకాయిచికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. భారత్-జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తకాయిచితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ఈ బంధం కీలకం అని ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా తెలిపారు.
సనాయే తకైచి బ్రిటిష్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ అంటే అభిమానం. అయితే ఆమె స్వలింగ వివాహాన్ని వ్యతిరేకిస్తారు. సంక్లిష్టమైన అంతర్జాతీయ సవాళ్లు, దేశీయ ఆర్థిక సంస్కరణలు, పెరుగుతున్న వయోవృద్ధ జనాభా సమస్యలు, చైనా వంటి పొరుగు దేశాలతో సంబంధాల వంటి కీలక అంశాలలో ఆమె నాయకత్వంపై ప్రజలు ఆశగా ఉన్నారు. ఆమె ఎంపిక లింగ సమానత్వం దిశగా జపాన్ వేసిన ముఖ్యమైన ముందడుగుగా అంతర్జాతీయ సమాజం భావిస్తోంది.
