Karur Stampede

Karur Stampede: విజయ్‌ పర్యటన వాయిదా.. టీవీకే పార్టీ నేతకు బెయిల్‌ నిరాకరించిన మద్రాస్‌ హైకోర్టు

Karur Stampede: కరూర్‌లో ఇటీవల జరిగిన దారుణ తొక్కిసలాట ఘటనపై మద్రాస్‌ హైకోర్టు మళ్లీ సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి టీవీకే పార్టీ (TVK) నామక్కల్‌ జిల్లా కార్యదర్శి సతీష్‌కుమార్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ర్యాలీ సందర్భంగా జన సమూహాన్ని నియంత్రించడంలో పార్టీ ఎందుకు విఫలమైందని కోర్టు ప్రశ్నించింది.

ఇదిలా ఉండగా, బాధితులకు అదనపు పరిహారం కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, రెండు వారాల్లోగా స్పందన ఇవ్వాలని ఆదేశించింది.

సీబీఐ దర్యాప్తు డిమాండ్‌పై కోర్టు నిర్ణయం

ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌ తిరస్కరించింది. దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున ఈ దశలో ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో సభలు, ర్యాలీల్లో కనీస సదుపాయాలపై కోర్టు ప్రశ్నలు సంధించింది.

  • ప్రజలకు నీళ్ళు, ఆహారం, టాయిలెట్లు, పార్కింగ్ వంటి సదుపాయాలు ఎందుకు కల్పించలేదని టీవీకే పార్టీని ప్రశ్నించింది.

  • రోడ్డు మీద సమావేశం నిర్వహించేందుకు అనుమతి ఎందుకు ఇచ్చారని పోలీసులను కూడా కోర్టు నిలదీసింది.

ఘటనలో ప్రాణనష్టం

సెప్టెంబర్‌ 27న విజయ్‌ ప్రచార ర్యాలీ సందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది మహిళలు, 13 మంది పురుషులు, 10 మంది చిన్నారులు ఉన్నారని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ఆసుపత్రికి తరలించిన 39 మంది మార్గమధ్యంలోనే మృతిచెందారని వైద్యులు తెలిపారు. మరో 50 మందికిపైగా గాయపడి చికిత్స పొందుతున్నారు.

ఇది కూడా చదవండి: Pvn Madhav: పెట్రోల్ ధరలు తగ్గకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణం

విజయ్‌ పర్యటన వాయిదా

ఈ ఘటన తరువాత టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనలను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

రాజకీయ వాదోపవాదాలు

ఈ ఘటనపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. విజయ్‌ అధికార డీఎంకేపై తీవ్ర విమర్శలు చేస్తుండగా, డీఎంకే విజయ్‌ను తప్పుపడుతోంది. దీంతో కరూర్‌ ఘటన ఒకవైపు ప్రజలను కుదిపేస్తే, మరోవైపు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *