AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సుమారు 20 అంశాలతో కూడిన అజెండాతో ఈ భేటీ కానుంది. ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి, కేబినెట్ ఆమోదం తెలపనుంది.
ప్రధాని మోదీ పర్యటనపై చర్చ
ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో, అందుకు సంబంధించిన ఏర్పాట్లపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. ప్రధాని మోదీ శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత, కర్నూలులో జరిగే భారీ ర్యాలీలో పాల్గొంటారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని ఎన్డీయే ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలు, రాష్ట్రవ్యాప్తంగా జరపబోయే అవగాహన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఆటో డ్రైవర్లకు తీపి కబురు: రూ.15,000 ఆర్థిక సాయం
ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం అందించే పథకం ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ పథకాన్ని అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆదాయం తగ్గిన డ్రైవర్లకు అండగా నిలవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ?
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, అలాగే కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులపై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ అంశంపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను పరిశీలించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రాజధాని అమరావతిపై దృష్టి
అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి సీఆర్‌డీఏ (Capital Region Development Authority) ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతిలో వివిధ పనులను వేగవంతం చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) ఏర్పాటుపైనా నిర్ణయం తీసుకోనున్నారు. రాజధాని ప్రాజెక్ట్ భూమి సేకరణకు న్యాయపరమైన రక్షణ కల్పించే మినహాయింపులపైనా చర్చ జరగనుంది.
Also Read: Devaragattu Karra Samaram: దేవరగట్టు కర్రల సమరంలో విషాదం
టెక్నాలజీ, టూరిజంకు ప్రోత్సాహం
టెక్ హబ్స్‌కు భూ ప్రోత్సాహక విధానం (LIFT Policy 2024-29): టెక్నాలజీ హబ్స్‌కు భూమి కేటాయింపులు, ప్రోత్సాహకాలకు సంబంధించిన విధానానికి ఆమోదం లభించే అవకాశం ఉంది.
కారవాన్ టూరిజం: కొత్త పర్యాటక విధానంలో భాగంగా కారవాన్ పర్యాటకానికి (హోటల్ లాంటి సదుపాయాలు ఉన్న ప్రత్యేక వాహనాల్లో ప్రయాణం) కేబినెట్ ఆమోదం తెలపనుంది. హోమ్‌స్టే ప్రోత్సాహకాలను కూడా ఈ విధానంలో చేర్చనున్నారు.
ఇతర కీలక అంశాలు
జలవనరుల శాఖ పనులు: హంద్రీ-నీవా, ప్రకాశం బ్యారేజీ-దివిసీమ వరద నష్టం మరమ్మతులు, మైలవరం డ్యామ్ గేట్ల బలోపేతం, తిరుమల-తిరుపతి తాగునీటి సరఫరా ప్రాజెక్టుల వంటి వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్.
చట్ట సవరణలు: కుష్టు వ్యాధి పదాన్ని చట్టాల నుంచి తొలగించే ప్రతిపాదనతో పాటు, కార్మిక చట్టాల్లో పలు సవరణలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
భూ కేటాయింపులు: అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా పలు కంపెనీలకు, సంస్థలకు భూ కేటాయింపులపై చర్చ.
రాజకీయ పరిస్థితులపై సీఎం సమీక్ష..
కేబినెట్ సమావేశం అనంతరం, సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం వంటి అంశాలపై చర్చించనున్నారు. ప్రత్యర్థుల విమర్శలను ఎలా ఎదుర్కోవాలి, మంత్రులు ఎలా వ్యవహరించాలి అనే దానిపై దిశానిర్దేశం చేస్తారని సమాచారం.
