Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రి పవన్ కల్యాణ్ విశాఖపట్నంలోని రుషికొండ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించారు. ఈ భవనాలు పర్యాటక ప్రయోజనాల కోసం కాకుండా, జగన్ వ్యక్తిగత నివాసం కోసం నిర్మించబడ్డాయని ఆయన వ్యాఖ్యలు చేశారు.
రుషికొండ భవనాలను పరిశీలించిన పవన్, నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ భవనాల నిర్మాణానికి సుమారు రూ. 454 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 7 బ్లాకులు ఉండగా, కేవలం నాలుగు బ్లాకులను మాత్రమే నిర్మించారు. గతంలో ఈ రిసార్టుల నుంచి నెలకు రూ. 70 లక్షల వరకు ఆదాయం వచ్చేదని, ఇప్పుడు మాత్రం కరెంట్ బిల్లులకే నెలకు రూ. కోటి వరకు ఖర్చవుతోందని అధికారులు తెలిపారు.
Also Read: Roger Binny: బీసీసీఐ అధ్యక్షుడుగా తప్పుకున్న రోజర్ బిన్నీ
గతంలో తాను రుషికొండ భవనాలను పరిశీలించడానికి ప్రయత్నించినప్పుడు వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని, ఎన్నో అడ్డంకులు సృష్టించిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ భవనాలను ప్రజలకు, పర్యాటకానికి ఎలా ఉపయోగించాలో తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని పవన్ తెలిపారు. రుషికొండపై జరిగిన అక్రమాలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యాటక రిసార్టులను తన స్వలాభం కోసం వాడుకున్నారని, ఇవి ప్రజల సొమ్ముతో నిర్మించిన భవనాలని పవన్ కల్యాణ్ విమర్శించారు. పర్యాటక రంగానికి బదులుగా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ భవనాలను ఉపయోగించుకోవడం దారుణమని ఆయన మండిపడ్డారు.
