Cm chandrababu: ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం మోపండి

Cm chandrababu: రాష్ట్రంలో ఎరువుల ధరలను కృత్రిమంగా పెంచి రైతులను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. “ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకూడదు. ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం మోపాలి” అని ఆయన ఆదేశించారు.

ఆదివారం రాష్ట్రంలో ఎరువుల లభ్యత, సరఫరా పరిస్థితిపై ఆయన ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు వ్యవసాయ, విజిలెన్స్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కీలక ఆదేశాలు:

జిల్లాల వారీగా ఎరువుల నిల్వలు, సరఫరా వివరాలను తెలుసుకున్న సీఎం, యూరియాను వ్యవసాయేతర పనులకు తరలించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

నిబంధనలు ఉల్లంఘించే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలని, యూరియా నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రైవేటు డీలర్లకు కేటాయింపులు తగ్గించి, ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్ ద్వారా ఎరువుల సరఫరాను పెంచాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.

“రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత రాకుండా చూడటం అధికారుల బాధ్యత” అని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *