Telangana Cabinet Meeting: ఆగస్టు 25న తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరగనున్నది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారిన అంశాలపై ఆ నిర్ణయాలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. స్థానిక ఎన్నికలపై మంత్రివర్గ భేటీలో చర్చ జరుగుతుందని, ఎన్నికల అంశాలపై కీలక నిర్ణయాలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు.
ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల పెంపు, స్థానిక ఎన్నికల నిర్వహణ గడువు అంశాలపై చర్చించి తగు నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. తొలి నుంచే రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపు అమలు అంశంపై పట్టుదలతో ఉన్నది. అసెంబ్లీ ప్రతిపాదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నది. ఇదే రిజర్వేషన్ల పెంపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ ముసాయిదా కూడా గవర్నర్ ఆమోదం కోసం పంపింది.
ఇది కూడా చదవండి: Stray Dogs: వీధి కుక్కలా దాడి.. విద్యార్థిని ముఖంపై 17 కుట్లు వేసిన వైద్యులు
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. హైకోర్టు విధించిన గడువు లోగా నిర్వహించాలంటే సత్వర నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశంపై ఈ నెల 25న జరిగే రాష్ట్ర మంత్రివర్గ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా, బీసీ బిల్లు చట్టరూపం దాల్చకున్న, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లనే అమలు చేసి, పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనను ముందుకు తేనున్నారని తెలుస్తున్నది.
అదే విధంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపైనా మంత్రిమండలి సమావేశంలో చర్చిస్తారని భావిస్తున్నారు. ఆ నివేదికపై అసెంబ్లీలో ప్రవేశపెడితే చర్చించాల్సిన అంశాలపై మంత్రులు ఓ అంగీకారానికి వస్తారని తెలుస్తున్నది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా ఇదే మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకుంటారని కూడా అనుకుంటున్నారు. ఈ నెల 25న మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరుగుతుంది.
