Kakinada: కాకినాడలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఒక యువకుడు పరుగులో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరం జిల్లా, సంతకవిటి మండలం, శ్రీహరినాయుడుపేట గ్రామానికి చెందిన సాయి కిరణ్ (22) అనే యువకుడు మంగళవారం ఉదయం 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నాడు. పరుగులో ఉన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది, ఇతర అధికారులు సాయి కిరణ్‌ను కాకినాడలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. కొడుకు మరణ వార్త విని సాయి కిరణ్ తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ కొడుకు ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్న ఆశతో వెళ్తే, ఇలా జరగడం తమకు తీరని వేదన మిగిల్చిందని వాపోయారు.
ఈనెల 5న ప్రారంభమైన ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ రేపటితో ముగియనుంది. ఈ ర్యాలీలో పదివేల మందికి పైగా యువకులు పాల్గొన్నారు. ఈ విషాద ఘటనతో ర్యాలీలో పాల్గొంటున్న ఇతర అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
