Rain Alert: తెలంగాణలో వర్షాలు వేగం పెంచాయి. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగైదు రోజులుగా వర్షాలు పడుతుండగా, మంగళవారం (జూలై 22) నుండి మరింతగా కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ సందర్భంగా 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్?
మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు:
ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి.
బుధవారం (జూలై 23) రోజున కూడా మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఎక్కడ ఎల్లో అలర్ట్?
మంగళవారం నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు:
ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్.
ఈ జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.
హైదరాబాద్ వాతావరణం
మంగళవారం హైదరాబాద్ మేఘావృతంగా ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ప్రభుత్వం అప్రమత్తం
భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, పోలీసులు, హైడ్రా బృందాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల కారణంగా అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా గిరిజన ప్రాంతాలకు వైద్య బృందాలను పంపాలని సూచించారు.
రైతులకు ఊరట
ఈ వానాకాలంలో ఇప్పటివరకు ఆశించినంత వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే, గత మూడు రోజులుగా పడుతున్న భారీ వర్షాలతో రైతులకు కొంత ఊరట లభించింది. రానున్న రోజుల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ప్రజలకు సూచనలు
అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ ఇచ్చే సూచనలను పాటించాలి. భారీ వర్షాల కారణంగా రోడ్లపై, చెరువుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

