CM Chandrababu: కడపలో జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమం అద్భుతంగా సాగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ విజయాన్ని సాధించడానికి జిల్లా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేశారని, ఇది టీడీపీ శక్తిని చాటిందన్నారు. శ్రమించిన నేతలు, కార్యకర్తలకు సీఎం అభినందనలు తెలిపారు. సమిష్టి కృషితో ఏదైనా సాధ్యమవుతుందన్న సందేశాన్ని ఈ మహానాడు ఇచ్చిందని పేర్కొన్నారు.
వినూత్నంగా మంత్రులు సైతం కార్యకర్తల మాదిరిగా పని చేసి శ్రేష్ఠమైన ఉదాహరణగా నిలిచారని చంద్రబాబు కొనియాడారు. ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా హాజరవడం ఎంతో సంతోషకరమని చెప్పారు. మహానాడులో ప్రవేశపెట్టిన ‘నా తెలుగు కుటుంబం’లో భాగమైన ఆరు శాసనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ పాలన సాగుతున్నదని సీఎం వివరించారు. గత ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో సానుకూల స్పందన కనిపిస్తోందన్నారు. ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా క్యాలెండర్ రూపంలో కార్యక్రమాలు ప్రకటించనున్నట్లు చెప్పారు.
ఇక మరోవైపు, కోనసీమ జిల్లాలో శనివారం సీఎం చంద్రబాబు పర్యటనను పురస్కరించుకుని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12:50కి సి.హెచ్.గున్నేపల్లి హెలిపాడ్ వద్ద దిగనున్నారు. అనంతరం చెయ్యారు గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించనున్నారు. అక్కడే పింఛన్‌ల పంపిణీ, ప్రజావేదికలో గ్రామస్తులతో సమావేశం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి.
Also Read: Mamata Banerjee: నరేంద్ర మోదీపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu: ‘‘బంగారు కుటుంబం’’ పథకానికి శ్రీకారం చుడుతూ, నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5:15కి హెలిపాడ్ నుంచి తిరుగు ప్రయాణం సాగించనున్నారు. జిల్లాలో సుమారు ఐదు గంటల పాటు సీఎం పర్యటన కొనసాగనుంది.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ కృష్ణారావు, టీడీపీ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు ఏర్పాట్లను సమీక్షించారు. నాయకులు, కార్యకర్తలు పూర్తి సహకారం అందించాలని వారు కోరారు.

