Chandrababu Naidu:ఉగ్రదాడి ఒక అనాగరిక చర్య అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఉగ్రవాద చర్యలు భారతదేశాన్ని ఏమీ చేయలేవని, దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉన్నదని చెప్పారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించి, అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళికి విశాఖలో ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రమౌలితోపాటు కావలికి చెందిన ఐటీ ఉద్యోగి మధుసూదన్ కూడా పహల్గాం ఉగ్రదాడిలో మరణించారు.
Chandrababu Naidu:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పహెల్గాం ఉగ్రదాడిలో మృతి చెందారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ కశ్మీర్‌తో అనుబంధం ఉన్నదని, ఇలాంటి క్లిష్ట సమయంలో అందరూ కలిసి కట్టుగా నిలబడాలని, ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
Chandrababu Naidu:బాధిత కుటంబాలు నిలదొక్కుకోవడానికి అందరూ సహకరించాలని చంద్రబాబు కోరారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి అదే చివరి రోజు కావాలని హెచ్చరించారు. ప్రజలు పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలని కోరుకున్నారు. 2042 వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఈ దశలో ఉగ్రదాడులకు తీవ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని సమాజ భద్రతతో నడవాలని అని చంద్రబాబు సూచించారు.
Chandrababu Naidu:చంద్రమౌళి భౌతికకాయాన్ని విశాఖ కనకదుర్గ నర్సింగ్‌హోం మార్చురీకి తరలించారు. భౌతికకాయం వెంట జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా బాలవీరంజనేయస్వామి ఉన్నారు. గురువారం సాయంత్రం మృతుడు చంద్రమౌళి ఇద్దరు కుమార్తెలు విశాఖకు చేరుకుంటారు. ఆ తర్వాత శుక్రవారం అంతిమ సంస్కారాల నిర్వహణకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

