TS Inter Results 2025: తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవలే ముగిశాయి. ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించగా, ప్రస్తుతం మూల్యాంకనం, కంప్యూటరీకరణ, రీవెరిఫికేషన్ వంటి ప్రక్రియలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియలు అన్నీ పూర్తయిన అనంతరం ఫలితాలను ఏప్రిల్ నెలాఖరులో ప్రకటించే అవకాశం ఉంది.
అధికారిక సమాచారం ప్రకారం, ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 25న విడుదల చేయాలని ఇంటర్ బోర్డు యోచిస్తోంది. అంతే కాకుండా, ఫలితాలను ఇంటర్మీడియట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. విద్యార్థులు తమ ఫలితాలను https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Delhi: దేశవ్యాప్తంగా హైఅలర్ట్
ఇక వేసవి సెలవుల విషయానికి వస్తే, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు ఇప్పటికే సెలవులు ప్రకటించగా, జూన్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కాలేజీలు జూన్ 2వ తేదీ నుంచి పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలకు మాత్రం కొత్త విద్యాసంవత్సరం జూన్ 12 నుంచి మొదలుకానుంది.
10వ తరగతి ఫలితాలపై అప్డేట్
తెలంగాణ పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు 2,650 కేంద్రాల్లో నిర్వహించబడ్డాయి. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పలు చోట్ల చిన్నచిన్న సమస్యలు వచ్చినా, మొత్తం పరీక్షా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
ప్రస్తుతం, రాష్ట్ర వ్యాప్తంగా 19 మూల్యాంకన శిబిరాల్లో ఏప్రిల్ 7 నుంచి 15 వరకు ఎస్‌ఎస్‌సీ బోర్డు స్పాట్ మూల్యాంకనాన్ని నిర్వహిస్తోంది. దీనికి మరికొన్ని రోజులు కలిపితే, ఫలితాల ప్రకటనకు అవసరమైన అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 10వ తరగతి ఫలితాలను కూడా ఏప్రిల్ చివర్లో ప్రకటించే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ లేదా https://www.manabadi.co.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
మొత్తానికి, ముందుగా ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉండగా, ఆ తరువాత టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
