China: బీపన్ నదిపై 2050 అడుగుల ఎత్తులో ఘన నిర్మాణం – ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనున్న హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ అద్భుతాల పుట్టినిల్లు చైనాలో మరోసారి మేధస్సుతో నిండిన నిర్మాణానికి రూపం ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనగా నిలవనున్న హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్‌ను గుయ్‌ఝౌ ప్రావిన్స్‌లో విజయవంతంగా పూర్తి చేశారు. ఇది బీపన్ నదిపై నిర్మించబడింది. ఈ వంతెన భూభాగం నుంచి 2,050 అడుగుల ఎత్తులో ఉండగా, ఇది ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ కన్నా 200 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంది.
ఈ వంతెన ప్రత్యేకత ఏంటంటే, రెండు మైళ్ల పొడవుతో, మధ్యలో ఎటువంటి సపోర్ట్ లేకుండా పూర్తిగా సస్పెన్షన్ విధానంలో నిర్మించడం. సాంకేతికంగా గట్టి కసిని చూపించిన చైనా, ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 280 మిలియన్ డాలర్లు (రూ.2400 కోట్లు) వెచ్చించింది. 2022లో నిర్మాణం ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌ను మూడేండ్లలో పూర్తి చేయడం మరో ప్రత్యేకత.
ఈ వంతెన అందుబాటులోకి రాకముందు, గుయ్‌ఝౌ ప్రాంతంలోని నివాసితులు లోయ చుట్టూ తిరుగుతూ గంటకు పైగా ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ వంతెన ద్వారా నిమిషాల వ్యవధిలోనే అవతలి వైపునకు చేరుకోవచ్చు. దీనివల్ల ఆర్థికంగా, సమయపరంగా ప్రజలకు ఎంతో ఉపశమనం లభించనుంది. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా వ్యవస్థతో పాటు, ఇది పర్యాటక కేంద్రంగా కూడా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
China: గుయ్‌ఝౌ ప్రావిన్స్ ఇప్పటికే వంతెనల ఘనతకు ప్రసిద్ధి చెందింది. గణాంకాల ప్రకారం, ప్రపంచంలోని అత్యధిక ఎత్తులో ఉన్న 100 వంతెనల్లో సగం వరకు ఇదే ప్రాంతంలో ఉన్నాయి. ఇందులో గతంలోనే నిర్మించిన 1,854 అడుగుల ఎత్తు గల బేపాన్జియాంగ్ వంతెన కూడా చేరుతుంది. ఇప్పుడు హువాజియాంగ్ బ్రిడ్జ్ ఆ రికార్డును అధిగమించింది.
Also Read: Plotting to Kill Trump: ట్రంప్ హత్యకు డబ్బులివ్వలేదని.. తల్లిదండ్రులను హత్యచేసిన యువకుడు!
ఇప్పటికే ఈ వంతెనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. భయపెట్టే ఎత్తు, ఆకర్షణీయమైన డిజైన్, ఆకాసాన్నంటే పొడవు చూసిన నెటిజన్లు ‘ఇది వాస్తవంగా మనిషి చేతిలో నిర్మించిందా?’ అని ఆశ్చర్యపోతున్నారు.
ఈ వంతెనను 2025 జూన్‌లో అధికారికంగా ప్రారంభించనున్నారు. చైనా ప్రభుత్వం ఈ వంతెనను ప్రయాణ సౌలభ్యం కోసం మాత్రమే కాక, పర్యాటక అభివృద్ధి దృష్ట్యా కూడా ఉపయోగించాలనే లక్ష్యంతో ఉంది. ఇది చైనా యొక్క టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ ప్రణాళికా శక్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెబుతోంది.
