Pawan Kalyan: తమిళనాడు రాజకీయ రంగంలో ఈ రోజు ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు రెండు పార్టీలూ పొత్తు విషయాన్ని అధికారికంగా ప్రకటించాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా అన్నాడీఎంకే నేత పళనిస్వామి పేరును ప్రకటించడం గమనార్హం.
ఈ కూటమిపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బీజేపీ – అన్నాడీఎంకే కూటమి ఏర్పాటును స్వాగతార్హమైనదిగా అభివర్ణించిన ఆయన, ఈ కూటమికి తన హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
“పళనిస్వామి garu వంటి పాలనాపరమైన అనుభవం గల నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా, ప్రజలకు మంచి పరిపాలన అందించాలన్న సంకల్పాన్ని కూటమి చాటింది” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పళనిస్వామికి ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్డీయే విధానాల ద్వారా రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమవుతుందని, తమిళనాడుకు ఈ కూటమి వల్ల నిస్సందేహంగా మేలు జరుగుతుందని పవన్ కల్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది దేశ రాజకీయాల్లో ఒక విశేషమైన పరిణామమని ఆయన పేర్కొన్నారు.
