Pawan True Leader

Pawan True Leader: అడవి తల్లి ఆశీస్సులే అంజనీ ‘పుత్రుడి’కి అండ

Pawan True Leader: ఒక సామాన్య మనిషికి కుటుంబం అంటే ప్రపంచం. కానీ ఒక నిజమైన నాయకుడికి ప్రజలు కూడా తన కుటుంబమే. ఈ సత్యాన్ని తన జీవితంలో ఆచరించి చూపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడి, సింగపూర్‌లో చికిత్స పొందుతున్న సమయంలోనూ, ఆ తండ్రి గుండెలోని ఆవేదనను అణచుకుని, గిరిజనుల కోసం “అడవి తల్లి బాట”లో అడుగులు వేశారు. ఇది కేవలం రాజకీయ కార్యక్రమం కాదు… ఇది ఒక హృదయ స్పందన, ఒక ఆదర్శం, ఒక నాయకుడి బాధ్యతకు చిహ్నం.

మార్క్ శంకర్‌కు జరిగిన ప్రమాదం విషయం తెలిసినప్పుడు పవన్ అరకు పర్యటనలో ఉన్నారు. తన కుమారుడు చదువుతున్న స్కూల్‌లో ప్రమాదం జరిగిందని ఫోన్ వచ్చిందనీ… కానీ తీవ్రత ఇంత ఉంటుందని ఊహించలేదనీ.. గొంతు జీరబోయి చెప్పిన మాటలు ఒక తండ్రిగా పవన్‌ అనుభవిస్తున్న బాధని తెలియజేస్తాయి. ఏడెనిమిదేళ్ల కుమారుడికి చేతులు, కాళ్లకు కాలి గాయాలు, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడం… ఈ విషయాలు విన్న ఏ తల్లిదండ్రులైనా కుంగిపోతారు. ప్రధాని మోదీ నుంచి సింగపూర్ హైకమిషనర్ వరకు ధైర్యం చెప్పారు, ఎలాంటి సహకారమైనా అందిస్తామని హామీ ఇచ్చారు. అయినా, ఆ బాధను దాటుకుని, గిరిజనులకు ఇచ్చిన మాట కోసం పవన్.. అడవి తల్లి బాటని కొనసాగించడం ఆయనలోని గొప్ప నాయకత్వ లక్షణానికి నిదర్శం.

Pawan True Leader: గత రెండు రోజులుగా విశాఖ జిల్లా మన్యం ప్రాంతంలో పవన్ చేసిన పర్యటన సామాన్యమైనది కాదు. గిరిజనుల సమస్యలను వారి భాషలోనే తెలుసుకున్నారు. రవాణా, విద్య, వైద్యం లేని వారి గుండెల్లో ఆశలు నింపారు. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన గిరిజన సంక్షేమాన్ని చేతల్లో చూపేందుకు కొండ శిఖరాలకు వెళ్లారు. తన భద్రతను పక్కనపెట్టి, వారి జీవన స్థితిగతులను అర్థం చేసుకుని, అక్కడికక్కడే పరిష్కార మార్గాలు సూచించారు. గంజాయి సాగుకు బదులు ఔషధ మొక్కలు, సేంద్రీయ వ్యవసాయంలో శిక్షణ, గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు… ఇవన్నీ పవన్ ఆలోచనలోని దూరదృష్టిని తెలియజేస్తాయి. కురిడి గ్రామానికి సొంత డబ్బు ఐదు లక్షలు విరాళంగా ఇస్తానని చెప్పినప్పుడు, గిరిజనుల కళ్లలో ఆనంద భాష్పాలు తొణికిసలాడాయి. “నేను ఈ గ్రామ దత్తపుత్రుడిని” అని పవన్ చెప్పినప్పుడు, ఆ మాటల్లో రాజకీయ హంగు, ఆర్భాటం లేదు. ఉన్నది కేవలం స్పందించే హృదయం.

Also Read: Mamata Banerjee: మేం వక్ఫ్ చట్టాన్ని అమలు చేయం.. ఏం చేస్తారో చేసుకోండి..

గిరిజన యువత వారి కళలు, నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ సొంతంగా ఆదాయం పొందేలా, మన్యంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా తన ఆలోచనలని, ప్రణాళికలని అడవి బిడ్డలకు వివరించారు పవన్‌ కళ్యాణ్‌. అడవి సౌందర్యాన్ని కాపాడుతూ, జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ… రిసార్టులు, సినిమా షూటింగ్ యూనిట్ల ద్వారా ఉపాధి కల్పించాలన్న ఆలోచనను గిరిజనం ముందుంచారు. ఇన్నాళ్లూ మావోయిస్టుల ఆశ్రయంగా మిగిలిన గిరిజన గ్రామాలకు, పవన్ ద్వారా ప్రభుత్వం అండగా నిలిచింది. మన్యంలో వందల గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పిస్తూ, తాగునీటి సమస్యల్ని తీరుస్తూ.. మన్యం ప్రజలకు ఆపద్భాందవుడిలా నిలిచారు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.

Pawan True Leader: ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించి, కూటమి అధికారంలోకి రావడానికి కారణమైన పవన్, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఏసీ గదుల్లో కూర్చోలేదు. తనకు ఇష్టమైన అటవీ శాఖను ఎంచుకుని, గిరిజనుల కోసం ఆచరణలోకి దిగారు. కొడుకు ఆస్పత్రిలో ఉన్నప్పటికీ, వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం తన పర్యటన కొనసాగించారు. ఇది ప్రజల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ, బాధ్యతా భావాన్ని తెలియజేస్తుంది. ఒక నాయకుడు అంటే ఆదేశాలు ఇచ్చేవాడు మాత్రమే కాదు… ఆచరించి చూపేవాడు. పవన్ కళ్యాణ్ ఈ లక్షణాన్ని పునికి పుచ్చుకున్నారు. గిరిజనులు ఆయన్ని తమ గుండెల్లో పెట్టుకుంటున్నారు. పవన్ నీడలో అడవి తల్లి చల్లగా ఉంటుందని వారు భావిస్తున్నారు. బాధలోనూ ప్రజల కోసం నిలిచే ఈ గొప్పతనం చూస్తే, పవన్‌కు సెల్యూట్ కొట్టకుండా ఉండలేం. అందుకే.. ఆయన విమర్శకుల ప్రసంసలు సైతం అందుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *