Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్ తమ విజయ పరంపర కొనసాగిస్తోంది. సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సమగ్ర ప్రదర్శనతో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో మైకేల్ బ్రేస్‌వెల్ మరియు బ్యాటింగ్‌లో రచిన్ రవీంద్ర అద్భుత ప్రదర్శనలతో న్యూజిలాండ్ సులభంగా గెలిచింది. న్యూజిలాండ్ వంటి మేటి జట్టు క్వాలిటీ ముందు బంగ్లాదేశ్ ఏ విభాగంలోనూ నిలబడలేకపోయింది. సొంత గడ్డపై అతిగా తిరిగే పిచ్ లను రూపొందించి ఫలితాల కోసం ఆడేవారు ఒక్కసారిగా మంచి సమతూకమైన పిచ్ వచ్చేటప్పటికి బెంబేలెత్తిపోయారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు సాధించింది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో 110 బంతుల్లో 9 ఫోర్లతో 77 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో ఆడుకోగా, జకేర్ అలీ 55 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 45 పరుగులతో కీలక భాగస్వామ్యంలో తోడ్పడ్డాడు. అయితే, మిగతా బ్యాటర్లు మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మైకేల్ బ్రేస్‌వెల్ నాలుగు వికెట్లు తీశాడు, విల్ రూర్కీ రెండు వికెట్లు పడగొట్టగా… మ్యాట్ హెన్రీ మరియు కైల్ జెమీసన్ ఒక్కో వికెట్ తీశారు.
తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసి విజయం సాధించింది. రచిన్ రవీంద్ర 105 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 112 పరుగు చేసి సెంచరీతో అదర్గొట్టగా.., టామ్ లాథమ్ 76 బంతుల్లో 3 ఫోర్లతో 55 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హోస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నహిద్ రాణా మరియు టస్కిన్ అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీపై ఉగ్ర కుట్ర.. పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక!
పిచ్ స్లోగా ఉండటంతో పాటు, ఆరంభంలోనే విల్ యంగ్ మరియు కేన్ విలియమ్స్ ఔట్ కావడంతో న్యూజిలాండ్ కొంచెం ఒత్తిడికి గురైంది. అయితే, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే మరియు టామ్ లాథమ్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో ఆ జట్టు కొద్దిగా స్థిరపడింది. విజయం సమీపంలో ఉన్న సమయంలో రచిన్ మరియు లాథమ్ ఔట్ అయ్యారు, కానీ గ్లేన్ ఫిలిప్స్ 21, బ్రేస్‌వెల్ 11 పరుగులతో చివరి వరకు నిలబడి విజయాన్ని నిర్ధారించారు.
ఈ విజయంతో గ్రూప్-ఏ నుంచి న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. గ్రూప్-ఏలో రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ మరియు న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. అయితే, గ్రూప్-ఏలో టాప్ స్థానం ఎవరికి లభిస్తుందో అనేది మార్చి 2న జరిగే మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. న్యూజిలాండ్ యొక్క ఈ తాజా విజయంతో, ఆతిథ్య దేశం పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
1996 వన్డే ప్రపంచకప్ తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్, లీగ్ దశలోనే టోర్నీ నుంచి బయటపడడం ఆ దేశ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. భారీ అంచనాలతో టోర్నీలోకి వచ్చిన పాకిస్థాన్, న్యూజిలాండ్ మరియు భారత్ చేతిలో ఓడిపోయి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
