Garuda Vahana Seva: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. శ్రీదేవీ, భూదేవీ సమేతుడైన మలయప్ప స్వామి ప్రతి రోజూ వివిధ వాహనాల్లో తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో హైలైట్ అని చెప్పుకునే.. అత్యంత విశిష్టమైన వాహనసేవగా భక్తులు భావించే గరుడ వాహన సేవ మంగళవారం రాత్రి అంగరంగ విభవంగా జరిగింది. దాదాపుగా మూడున్నర లక్షల మంది భక్తుల మధ్యలో కలియుగ దైవం శ్రీ వేంకటేశుడు గరుడ వాహనంపై విహరిస్తుంటే.. ఆ వైభవం చూడటానికి భక్త జనకోటి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నిరీక్షించింది. సోమవారం రాత్రి నుంచే తిరుమాడ వీధుల స్టాండ్స్ లో భక్తులు శ్రీవారి గరుడ వాహన సేవ చూడటం కోసం ఎదురుచూశారు. అంటే దాదాపు 24 గంటల పాటు అక్కడే నిరీక్షించి భక్తులు శ్రీనివాసుని గరుడ వాహనంపై చూసి తరించిపోయారు.
Garuda Vahana Seva: ఏడుకొండలూ గోవిందనామస్మరణతో మారుమోగుతుండగా.. ఆపదమొక్కులవాడు తనకెంతో ఇష్టమైన గరుత్మంతుడిపై.. తనకంటకంటే ఇష్టమైన భక్త జనం కోసం తిరుమాడ వీధుల్లోకి తరలి వచ్చారు. ఆయనకు స్వాగతం చెబుతూ భక్తకోటి ముక్తకంఠంతో గోవింద నామాల కీర్తనతో స్వామివారిని దర్సించుకున్నారు. ఆలయ గర్భగుడిలో ఒక్క క్షణం దర్శనంతోనే మనసును పులకరింపచేసే దేవదేవుడు.. తిరుమాడ వీధుల్లో నాలుగు వైపులా వేచి ఉన్న భక్తుల కోసం గరుడ వాహనంలో వేంచేసి తిరుగాడిన క్షణాలను అపురూపంగా గుండెల్లో దాచుకున్నారు భక్తులు.
Garuda Vahana Seva: గరుడ వాహనంపై విహరించే వేయినామాలవాడిని దర్శించుకుంటే.. వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనేది భక్తుల నమ్మకం. జీవితంలో ఒక్కసారైనా గరుడవాహన సేవలో శ్రీవారి దర్శనం చేసుకోవడం కోసం ఆరాట పడతారు. అందుకే లక్షలాదిమంది భక్తులు బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకమైన గరుడ వాహన సేవకు హాజరవుతారు. మంగళవారం రాత్రి గరుడవాహన సేవలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య.. మూడున్నర లక్షల మంది భక్తులు హాజరు కావచ్చనే అంచనాలతో వారికి కావలసిన ఆహరం.. నీరు.. ఇతర అవసరాలకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అయితే, అంతకు మించి భక్తులు గరుడ వాహన సేవ వీక్షించడానికి తరలి వచ్చినట్టు భావిస్తున్నారు. అయినప్పటికీ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

