Pushpa 2: పుష్ప-2 సినిమాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్డుకుంటామని జనసేన నేతలు, మెగా అభిమానులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ వివాదం గత ఎన్నికల ముందు నుంచే వస్తున్నా, తాజాగా సినిమా విడుదలకు రెండు రోజులు ముందు మళ్లీ రగడకు దారితీసింది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను నడవనీయమని చెప్తున్నారు. మెగాస్టార్, పవర్‌స్టార్‌కు అల్లు అర్జున కలవాలని, చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని, అప్పుడే సినిమా ఆడేందుకు సహకరిస్తామని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు.
Pushpa 2: జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయ కర్త చలమలశెట్టి రమేశ్‌బాబు బుధవారం మీడియాతో మాట్లాడారు. పుష్ప-2 సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ పోకడ.. జన సైనికులకు, మెగా అభిమానులకు బాధ కలిగించిందని తెలిపారు. అల్లు అర్జున మెగా కాంపౌండ్ హీరోయే కాబట్టి తాము ఈ డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
Pushpa 2: పవన్ కల్యాణ్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాజకీయాల్లో కొనసాగుతున్నారని, రాష్ట్రం కోసం, దేశం కోసం సేవ చేస్తున్నారని, చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు సామాజిక సేవలో తరిస్తున్నారని, ఇలాంటి వారిని కాదని అల్లు అర్జున్ గత ఎన్నికలకు ముందు మోసం చేశారని విమర్శించారు.
Pushpa 2: ఇప్పటికైనా అల్లు అర్జున్ చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు కాళ్లు కడిగి నెత్తిన చల్లు కోవాలని, లేదంటే పుష్ప-2 సినిమాను అడ్డుకొని తీరుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో జన సైనికులు, మెగా అభిమానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రగిలిపోతున్నారు. గోటితో పోయేదాన్ని అల్లు అర్జున్యే గొడ్డలి దాకా తెచ్చుకున్నారని అంటూ రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4న బెనిఫిట్ షోతో, 5న థియేటర్లలో విడుదల కానున్నందున ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని సంశయం నెలకొన్నది.
