Maharashtra CM: మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం ఎంపికపై ఏర్పడిన ప్రతిష్ఠంభన ఇంకా తొలగకపోగా, సీఎం పదవి కోసం కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో వచ్చే నెల 5న ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ అధిష్ఠానం ముందుకు సాగుతున్నది. ముంబైలోని ఆజాద్ మైదానంలో సీఎం సహా మంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీంతో మహారాష్ట్రతోపాటు దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా, బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమి 233 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. ప్రతి పక్ష మహా వికాస్ అగాడి కూటమి 51 స్థానాలకే పరిమితమైంది. మహాయుతి కూటమిలో బీజేపీ 133 స్థానాలను కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా అవతరించగా, దాని మిత్రపక్షాలైన శివసేన (షిండే) 57, ఎన్‌సీపీ (అజిత్ పవార్) 41 సీట్లను గెలుచుకున్నాయి. ప్రతిపక్ష మహావికాస్ అగాడి కూటమిలో శివసేన (ఉద్ధవ్) 20, కాంగ్రెస్ 16, ఎన్సీపీ (పవార్) 10 స్థానాలను గెలుచుకున్నాయి.
ఇది కూడా చదవండి: Gold rate: హెచ్చుతగ్గులతో పసిడి.. తులం ఎంతంటే..
Maharashtra CM: మహాయుతి కూటమి పూర్తి ఆధిక్యతను సాధించినప్పటికీ సీఎం ఎంపికపై ఇప్పటి వరకూ తర్జన భర్జన కొనసాగుతున్నది. ఇదే రాష్ట్రంతో పాటు ఎన్నికలు జరిగిన జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరగా, మహారాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతున్నది. అయితే తొలుత అత్యధిక స్థానాల్లో గెలుపొందిన బీజేపీ నుంచే సీఎం ఉంటారని, షిండే, అజిత్ పవార్‌ను డిప్యూటీ సీఎంలుగా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. దీనికి అటు షిండే, ఇటు అజిత్ పవార్‌లు సమ్మతించలేదని సమాచారం.
తన వల్లే మహాయుతి కూటమి విజయం సాధించిందని, తనకే మళ్లీ అవకాశం కల్పించాలని షిండే కోరుతూ వచ్చారు. అయితే బీజేపీ మాత్రం మెజార్టీ స్థానాలను చూపెడుతూ అంగీకరించడం లేదు. ఈ దశలో ఫడ్నవీస్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ ముందుకు రాగా, ససేమిరా అన్న షిండే అలిగి కనిపించడకుండా సొంత గ్రామానికి వెళ్లారని ప్రచారం. దీంతో పాటు మారాఠాల నుంచి ఫడ్నవీస్‌పై వ్యతిరేకత వస్తుందన్న మీమాంసతో బీజేపీ రూట్ మార్చింది.
బీజేపీకి చెందిన కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ పేరు తెరపైకి వచ్చింది. పుణె ఎంపీ అయిన మోహోల్ బీజేపీ అగ్రనాయకత్వం సీఎం అభ్యర్థిగా ముందుకు తెచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. సీఎం పదవికి పోటీ పడుతున్న దేవేంద్ర ఫడ్నవీస్‌కు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి అప్పగిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్, మోహోల్ ఇద్దరిలో బీజేపీ ఎవరిని సీఎంను చేస్తున్నదనే విషయం తేలనున్నది. లేదా షిండేకు మద్దతిస్తున్నదా, లేక పవార్‌ను అవకాశం కల్పిస్తున్నదా? అన్న విషయాలు తేటతెల్లం కానున్నాయి.


One Reply to “Maharashtra CM: మహారాష్ట్రలో మారుతున్న పరిణామాలు.. సీఎంగా తెరపైకి కొత్త పేరు”