AP News: విధి నిర్వహణలో నిబంధనలు పాటించడమే ఆ చిరుద్యోగుల పాలిట శాపమైంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి కోపం రావడంతో ఏకంగా ఐదుగురు టోల్ ప్లాజా సిబ్బంది తమ ఉపాధిని కోల్పోయిన ఘటన విజయవాడ బైపాస్ పరిధిలోని వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు అధికార, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. సీఎంవో కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా ప్రయాణిస్తున్న కారు గురువారం వెంకటపాలెం టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. టోల్ ఫీజు చెల్లించకుండా గేటు ఎత్తాలని ఆయన డ్రైవర్ అక్కడి సిబ్బందిని కోరారు. అయితే, ఆ కారు ముందు భాగంలో ఎలాంటి అధికారిక ఫ్లాగ్ లేకపోవడం, పైగా లోపల ఉన్నది ఎవరనే విషయాన్ని డ్రైవర్ స్పష్టంగా వివరించకపోవడంతో టోల్ సిబ్బంది ఆయన్ని గుర్తించలేకపోయారు. దీంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) టోల్ మినహాయింపు నిబంధనల ప్రకారం, గుర్తింపు కార్డు (ID Card) చూపించాలని సిబ్బంది అడిగారు.
దీంతో ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా ఒక్కసారిగా తీవ్ర అసహనానికి లోనయ్యారు. తాను సీఎంవో అధికారినని తెలిపినా ఐడీ కార్డు అడుగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న టోల్ ఇన్ఛార్జి తక్షణమే అక్కడికి చేరుకుని క్షమాపణలు కోరినప్పటికీ ఆయన శాంతించలేదు. కేవలం ‘సారీ’ చెబితే సరిపోదని, తానెవరో చూపిస్తానంటూ హెచ్చరించి దాదాపు 10 నిమిషాల పాటు అక్కడే కారులో ఉండిపోయారు.
అనంతరం ఎన్హెచ్ఏఐ ప్రతినిధులను, టోల్ ప్లాజా నిర్వాహకులను తన కార్యాలయానికి పిలిపించిన ఆయన.. ఆ ఘటన సమయంలో డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరినీ తక్షణమే విధుల నుంచి తొలగించాలని హుకుం జారీ చేశారు. కారుపై ఫ్లాగ్ లేకపోవడం వల్లే గుర్తించలేకపోయామని, కావాలని కారు ఆపలేదని నిర్వాహకులు ఎంత వివరణ ఇచ్చినా ఆయన వినలేదు. ఫలితంగా, చిరుద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న ముగ్గురు టోల్ కలెక్టర్లు, ఒక సూపర్వైజర్, షిఫ్ట్ ఇన్ఛార్జి సహా మొత్తం ఐదుగురిని గురువారమే నిర్వాహకులు ఉద్యోగాల నుంచి తొలగించారు.
