Samay Raina

Samay Raina: ప్రపంచంలోనే ఫస్ట్ యూట్యూబర్‌గా సమయ్ రైనా..!

Samay Raina: భారతీయ స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా ప్రపంచ యూట్యూబ్ చరిత్రలోనే మరే ఇతర క్రియేటర్ సాధించని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో ఏకంగా 10 లక్షల (1 మిలియన్) పెయిడ్ ఛానెల్ మెంబర్లను దక్కించుకున్న మొట్టమొదటి క్రియేటర్‌గా సమయ్ రైనా చరిత్ర సృష్టించాడు.

ఈ చారిత్రక మైలురాయిని గూగుల్ ఇండియా తన అధికారిక బ్లాగ్ ద్వారా ధ్రువీకరిస్తూ రైనాకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఒకప్పుడు తీవ్ర వివాదాలు, పోలీసు కేసులు, డిప్రెషన్‌తో కెరీర్ ముగిసిందనుకున్న దశ నుంచి పుంజుకొని, ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో నంబర్ వన్ రికార్డు నెలకొల్పడం ఇండియన్ క్రియేటర్ ఎకానమీలో హాట్ టాపిక్‌గా మారింది.

చెస్ స్ట్రీమింగ్ నుంచి కోట్లాది మంది ఫ్యాన్స్ వరకు..

కరోనా సమయంలో చెస్ గ్రాండ్‌మాస్టర్లతో సరదాగా లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ పాపులర్ అయిన సమయ్ రైనా, ఆ తర్వాత ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ (India’s Got Latent) షోతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. లక్షలాది మంది నెటిజన్లకు తన ఛానెల్‌ను ఒక ఫేవరెట్ వర్చువల్ హ్యాంగౌట్ అడ్డాగా మార్చేశాడని యూట్యూబ్ ప్రశంసించింది.

ప్రస్తుతం ఆయన ఛానెల్‌కు 1.24 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉండగా, నెలకు రూ. 59 (‘సమయ్ కే దోస్త్’), రూ. 599 (‘సమయ్ కే ఖాస్’), రూ. 1,999 (‘సైలెంట్ సపోర్టర్’) ప్లాన్లతో 10 లక్షల మంది క్రమం తప్పకుండా డబ్బులు చెల్లించే సభ్యులుగా చేరారు. 2026 జూన్ నెలలోనే భారత్‌లో 12 లక్షల మందికి పైగా అభిమానులు యూట్యూబ్ మెంబర్‌షిప్‌లు కొనుగోలు చేశారని, మన దేశంలో క్రియేటర్ల మెంబర్‌షిప్ ఆదాయం వార్షికంగా 25 శాతానికి పైగా పెరిగిందని యూట్యూబ్ వెల్లడించింది.

వివాదాల సుడిగుండం నుంచి అద్భుత కమ్‌బ్యాక్..

సమయ్ రైనా ప్రయాణం అంత సులువుగా సాగలేదు. 2025 ఫిబ్రవరిలో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో రణ్‌వీర్ అలహాబాదియా చేసిన ఒక జోక్ తీవ్ర దుమారానికి దారితీసింది. ఆ వివాదం ముదిరి సమయ్ రైనా, రణ్‌వీర్ సహా షోలో పాల్గొన్న పలువురిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు కావడంతో, ఆయన తన ఛానెల్ నుంచి అన్ని ఎపిసోడ్లను తొలగించాల్సి వచ్చింది.

ఆ సమయంలో కెనడాలో ఉన్నప్పుడు తాను తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యానని, ‘నా షో మళ్లీ ఎప్పుడైనా తిరిగి వస్తుందా?’ అని చాట్‌జీపీటీని (ChatGPT) అడిగేవాడినని.. దానికి చాట్‌జీపీటీ ‘ఇప్పుడే చెప్పలేం’ అంటే ‘ప్లీజ్ అవునని చెప్పు’ అని టైప్ చేసేవాడినని రైనా ఇటీవల ఎమోషనల్‌గా గుర్తుచేసుకున్నాడు. అయితే ఆ సంక్షోభాన్ని దాటుకుని ‘స్టిల్ అలైవ్’ (Still Alive) స్టాండప్ స్పెషల్‌తో మళ్లీ స్టేజ్ ఎక్కిన రైనా, 2026 జూన్‌లో నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ భాగస్వామ్యంతో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ సీజన్ 2ను అట్టహాసంగా తీసుకొచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *