High Court: భారతీయ దిగ్గజ పారిశ్రామిక సమూహం టాటా గ్రూప్ (Tata Group) అగ్రనాయకత్వంలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరి న్యాయపోరాటానికి దారితీశాయి! టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఎన్. చంద్రశేఖరన్ (N. Chandrasekaran) పునర్నియామకాన్ని సవాలు చేస్తూ టాటా ట్రస్టులు ఏకంగా బాంబే హైకోర్టును ఆశ్రయించాయి.
ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని జస్టిస్ అభయ్ అహుజా ధర్మాసనం ముందు ప్రస్తావించగా, రేపు (శుక్రవారం, నవంబర్ 27, 2026) విచారణకు రానుంది. అంతేకాకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నందుకు గాను సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (SDTT) రూ.50 కోట్లు, ఆర్.డి. టాటా ట్రస్ట్ (RDTT) రూ.15 కోట్లు కలిపి మొత్తం రూ.65 కోట్ల నష్టపరిహారాన్ని ఏడాదికి 18 శాతం వడ్డీతో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.
అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే.. చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనుండగా, 2027 ఫిబ్రవరి 21 నుంచి మరో ఐదేళ్ల పాటు ఆయన్ను ఛైర్మన్గా కొనసాగిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్ 17న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు. అయితే, ఆ సమావేశంలో ట్రస్టుల నామినీ డైరెక్టర్లు అయిన నోయెల్ టాటా ఈ నియామకాన్ని వ్యతిరేకించగా, మరో డైరెక్టర్ వేణు శ్రీనివాసన్ మద్దతు తెలిపారు. దీంతో ఇద్దరు డైరెక్టర్ల మధ్య ఓట్లు సమానమయ్యాయని భావించిన సమావేశ అధ్యక్షుడు, స్వతంత్ర డైరెక్టర్ హరీశ్ మన్వానీ తన నిర్ణయాత్మక ఓటు (Casting Vote) ఉపయోగించి చంద్రశేఖరన్ నియామకానికి ఆమోదం తెలిపారు.
అయితే, ఈ విధానాన్ని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, ఆర్.డి. టాటా ట్రస్ట్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లోని ఆర్టికల్ 121 ప్రకారం, కీలక బోర్డు నిర్ణయాలు చెల్లుబాటు కావాలంటే ఆర్టికల్ 104B కింద ట్రస్టులు నియమించిన డైరెక్టర్లలో మెజారిటీ సభ్యుల సానుకూల ఓటు తప్పనిసరి అని ట్రస్టులు వాదిస్తున్నాయి. బోర్డు ఛైర్మన్ వేసే ‘కాస్టింగ్ ఓటు’ ఆర్టికల్ 121 నిబంధనకు ప్రత్యామ్నాయం కాలేదని, కాబట్టి సెప్టెంబర్ 17న చేసిన తీర్మానం చెల్లదని స్పష్టం చేస్తున్నాయి.
ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రెండు ట్రస్టులు మెజారిటీతో తీర్మానాలు ఆమోదించాయి (నోయెల్ టాటా, ఆయన కుమారుడు నెవిల్లే, భాస్కర్ భట్ అనుకూలంగా ఓటేయగా, వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ వ్యతిరేకించారు). ఈ దావాలో టాటా సన్స్, చంద్రశేఖరన్, సీఎఫ్ఓ సౌరభ్ అగర్వాల్, స్వతంత్ర డైరెక్టర్లు హరీశ్ మన్వానీ, అనితా జార్జ్తో పాటు వేణు శ్రీనివాసన్, నోయెల్ టాటాలను ప్రతివాదులుగా చేర్చినప్పటికీ, నోయెల్ టాటాపై ఎలాంటి చర్యలు కోరడం లేదు.
వచ్చే సోమవారం (నవంబర్ 30న) టాటా సన్స్ కీలక బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ కోర్టు కేసు కార్పొరేట్ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది. ఆ సమావేశంలో కంపెనీ ప్రతిపాదిత ఐపీఓ (IPO) ప్రణాళికతో పాటు చంద్రశేఖరన్ పునర్నియామక ప్రక్రియపై చర్చించనున్నారు. ఒకవేళ ట్రస్ట్ డైరెక్టర్ల మధ్య మళ్లీ భిన్నాభిప్రాయాలు వస్తే, బోర్డు ఛైర్మన్ మళ్లీ ‘కాస్టింగ్ ఓటు’ ఉపయోగించి నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందని ట్రస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అందుకే నవంబర్ 30 సమావేశానికి ముందే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి, చంద్రశేఖరన్ పునర్నియామకంపై తదుపరి చర్యలను నిలిపివేయాలని మరియు కాస్టింగ్ ఓటు వినియోగాన్ని అడ్డుకోవాలని ట్రస్టులు హైకోర్టును అభ్యర్థించాయి. మరోవైపు, తమ నిర్ణయం నిబంధనల ప్రకారమే జరిగిందని టాటా సన్స్ వాదిస్తుండటంతో, రేపు బాంబే హైకోర్టులో జరగబోయే విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
