Fire Accident

Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 31 మంది మృతి.. 21 మందికి తీవ్ర గాయాలు!

Fire Accident: ఈజిప్ట్ రాజధాని కైరో (Cairo) నగరంలో అత్యంత రద్దీగా ఉండే రింగ్ రోడ్డు హైవేపై ఘోర రోడ్డు మరియు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గిజా గవర్నరేట్‌లోని ఇంబాబా (Imbaba) వరాఖ్ జిల్లాలో ఉన్న అషారా టన్నెల్ (Ashara Tunnel) సమీపంలో పెట్రోలియం లోడుతో వెళ్తున్న ఒక భారీ చమురు ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడి పేలిపోవడంతో ఏకంగా 31 మంది సజీవ దహనమయ్యారు, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవలి కాలంలో ఈజిప్ట్‌లో జరిగిన అత్యంత భయానక రోడ్డు ప్రమాదాలలో ఇది ఒకటిగా నిలిచింది.

ఈ ప్రమాదానికి గల కారణాలు, ఘటన జరిగిన తీరును పరిశీలిస్తే ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక ప్రైవేటు కాంట్రాక్టర్‌కు చెందిన చమురు ట్యాంకర్ కైరో రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తుండగా, ఒక్కసారిగా హైటెన్షన్ విద్యుత్ వైరు తెగి దాని ఎదుట పడింది. దీంతో డ్రైవర్ అదుపు తప్పడంతో ట్యాంకర్ రోడ్డుపై బోల్తా పడింది. ట్యాంకర్‌లోని పెట్రోల్ భారీగా రోడ్డుపైకి ఒలికి సమీపంలోని కార్లు, ఇతర వాహనాల కిందకు చేరింది.
అదే సమయంలో విద్యుత్ నిప్పురవ్వల వల్ల ఒక్కసారిగా భారీ పేలుడుతో మంటలు చెలరేగి చుట్టుపక్కల వాహనాలన్నింటినీ చుట్టుముట్టాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్యక్ష సాక్షులు ఆ దృశ్యాలను తలచుకుని వణికిపోతున్నారు. “దృశ్యం అత్యంత భయానకంగా ఉంది. కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి, లోపల ఉన్న మనుషులకు కనీసం డోర్లు తెరుచుకుని బయటకు వచ్చే సమయం కూడా దొరకలేదు. వాహనాలతో పాటే లోపల ఉన్నవారు కూడా కాలిపోయారు” అని అలీ యూసుఫ్ అనే ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నారు.
ఈజిప్ట్ ఆరోగ్య మరియు జనాభా శాఖ మంత్రి డాక్టర్ ఖలీద్ అబ్దెల్ గఫార్ ఈ ప్రమాద వివరాలను అధికారికంగా ప్రకటించారు. తొలుత మృతుల సంఖ్య 30గా నమోదైనప్పటికీ, తుది అంచనా తర్వాత 31 మంది మరణించినట్లు నిర్ధారించారు. అలాగే గాయపడిన 21 మంది కోసం 39 అంబులెన్స్‌లను ఘటనా స్థలానికి పంపించగా, 15 మందిని ఆసుపత్రికి తరలించారని, వీరిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మంటలు ఆరిన తర్వాత భారీ సంఖ్యలో జనం హైవేపైకి చేరుకోవడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగింది. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో వారిని గుర్తించేందుకు డీఎన్‌ఏ (DNA) పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. ఈ దుర్ఘటనపై ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్-ఫతా ఎల్-సిసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, రహదారుల నిర్వహణ లోపం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగా ఈజిప్ట్‌లో ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు (గతేడాది ఒక్క ఏడాదిలోనే అక్కడ రోడ్డు ప్రమాదాల్లో 6,000 మంది మరణించారు).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *